బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై తాము కేంద్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లుగా ఆయన వెల్లడించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న రిటైర్డ్ అధికారులను ఎన్నికల విధుల నుంచి వెంటనే తొలిగించాలని ఈసీని కోరినట్లుగా తెలిపారు.
డీజీపీ అంజనీ కుమార్ ను వెంటనే తొలిగించాలని ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు రేవంత్ రెడ్డి. నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించాలని చెప్పామన్నారు. సంక్షేమ పథకాల నగదు బదిలీపై ఎన్నికల అధికారులకు సూచన చేశామన్న రేవంత్.. నోటిఫికేషన్‌కు ముందే నగదు బదిలీని పూర్తి చేయాలని చెప్పామన్నారు. బీఆర్ఎస్ తమపై తప్పుడు ప్రచారం చేస్తు్ందిని మండిపడ్డారు.
Also Read : రైతు బంధు ఆపేందుకు కాంగ్రెస్ కుట్ర: మంత్రి కేటీఆర్
మేడిగడ్డ విషయంలో సీఎం కేసీఆర్ లాజిక్, కామన్ సెన్స్ కోల్పోయారనే అనుమానం ఉందన్నారు రేవంత్ రెడ్డి. పేలుడు పదార్థాలు పెడితే గాల్లోకి లేస్తాయి తప్ప, భూమిలోకి కుంగవని చెప్పారు. బొగ్గుగనులు ఉండటం వల్లే పిల్లర్లు కుంగయాన్నారు. సయిల్ టెస్ట్ చేయించకుండా కక్కుర్తి పడి గాల్లో మేడలు కట్టినట్లు కట్టారని విమర్శించారు. దీంతో కేసీఆర్ జైల్లోకి వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ ను కాపాడేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని రేవంత్ ఆరోపించారు.