కేసీఆర్ ను బొంద పెట్టి.. ఫాంహౌస్ లో పడుకోబెడితే.. ప్రతి నెలా ఒకటో తేదీనే అవ్వా తాతలకు 4 వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నర్సాపూర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీకి ఓడేసి.. గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చే హామీలను వివరించారు. ఒకటో తేదీన 4 వేల పెన్షన్ తోపాటు.. పేదల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వటం జరుగుతుందన్నారు. అభయహస్తం కింద ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరతామని భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఆడబిడ్డలకు కళ్యాణ్ లక్ష్మి కింద లక్ష రూపాయల డబ్బుతోపాటు తులం బంగారం ఇవ్వటం జరుగుతుందన్నారు రేవంత్ రెడ్డి.
కేసీఆర్ మోడల్ అంటున్నారని.. కేసీఆర్ మోడల్ అంటే లక్ష కోట్టు పెట్టి కట్టిన కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులు కుంగిపోవటమా అని ప్రశ్నించారాయన. కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డికి ఓటేసి గెలిపిస్తే.. ప్రతి మహిళ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించొచ్చని.. ఆడబిడ్డ చెయ్యెత్తితే చాలు బస్సు ఆగాలన్నారు. గ్యాస్ బండ ధరను 500 రూపాయలకు తగ్గించటం జరుగుతుందని.. ప్రతి మహిళా తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.
పండించిన పంటలను ఎవరూ కొనటం లేదని.. రైతులు బాధల్లో ఉన్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వ రాగానే ప్రతి గింజ కొనటమే కాకుండా వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వటం జరుగుతుందన్నారు రేవంత్ రెడ్డి. ఇల్లు లేని పేదలు అందరికీ ఇందిరమ్మ ఇంటి కింద ఉచితం స్థలం ఇవ్వటంతోపాటు ఇల్లు కట్టుకోవటానికి 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుందని భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి.
నర్సాపూర్ ను చార్మినార్ జోన్ లో కలిపే అంశాన్ని కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకుంటుందని.. అధికారంలోకి రాగానే నర్సాపూర్ పరిధిలోని లంబాడా తండాల అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు ఇచ్చే బాధ్యత పార్టీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. పార్టీ ఫిరాయించిన వాళ్లకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిన ద్రోహి కేసీఆర్ అంటూ విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. పదవుల కోసం నాయకులు అమ్ముడుపోయినా.. పార్టీని గెలిపించే కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారన్నారు రేవంత్ రెడ్డి.