హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను ఏటీఎంగా మార్చుకున్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు ధరణిని కూడా ఏటీఎంలా మార్చుకున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేసి, దాని కన్నా మెరుగైన వ్యవస్థను తెచ్చి భూములకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. టైటిల్ గ్యారంటీ కల్పిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్పీ వెంకటేశ్‌తో పాటు బీఆర్ఎస్, బీజేపీ నుంచి పలువురు నేతలు రేవంత్ నివాసంలో కాంగ్రెస్ చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణిని కేసీఆర్ తన దోపిడీ కోసం వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఆ పోర్టల్‌తో 35 లక్షల ఎకరాల దళిత, గిరిజనుల భూములను దోచుకున్నారని మండిపడ్డారు. వేలాది మంది వీఆర్వోలను తొలగించిన కేసీఆర్.. దళారీగా మారి వారి పనిని చేస్తున్నారని విమర్శించారు. కలెక్టర్లను అడ్డుపెట్టుకుని భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. ధరణి మీద 12 వేల గ్రామాల్లో గ్రామసభలు పెట్టేందుకు సిద్ధమా అని కేసీఆర్‌కు సవాల్ విసిరారు.
దోపిడీని ప్రశ్నిస్తే బీసీ కార్డా?
దోపిడీని ప్రశ్నిస్తే మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీసీ కార్డును వాడుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. మరి, ఆయన అక్రమ కేసులు పెట్టిన బాధితులు బీసీలు కాదా అని నిలదీశారు. ‘‘ప్రగతిభవన్, రాజ్ భవన్ మధ్య అగాధం ఉన్నట్టు కేసీఆర్ నమ్మించారు. ఉప్పు, నిప్పు అన్నట్టు వ్యవహరించారు. ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో ఇద్దరూ రాజ్ భవన్లో తలుపులు మూసి మాట్లాడుకున్నారు. మీ మధ్య ఏం రహస్యం ఉంది?’’ అని రేవంత్ ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చించి ఉంటే అందరి ముందే మాట్లాడుకోవచ్చు కదా అని ప్రశ్నించారు.
ఇన్నాళ్లూ గవర్నర్‌ను బీజేపీ అధ్యక్షురాలు అని విమర్శించిన కేసీఆర్.. ఇప్పుడు గవర్నర్ దగ్గరకెళ్లి మాట్లాడుతున్నారని విమర్శించారు. వీరి మధ్య ఎన్నికల పొత్తు అయినట్టా.. కానట్టో ప్రజలే తేల్చుకోవాలన్నారు. మోదీకి అసదుద్దీన్ ఒవైసీ ఛోటా భాయ్ అని ఎద్దేవా చేశారు. మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ముగ్గురూ తోడు దొంగలేనని ఆరోపించారు. మోదీకి కేసీఆర్ మద్దతిస్తున్నా.. అసదుద్దీన్ ఎందుకు నోరెత్తడం లేదని రేవంత్ ప్రశ్నించారు.