మరో ఉద్యమం రావాలె.. కేసీఆర్​ చెప్పిందేమీ చేయలేదు : రేవంత్

మరో ఉద్యమం రావాలె.. కేసీఆర్​ చెప్పిందేమీ చేయలేదు : రేవంత్

హైదరాబాద్​, వెలుగు:రాష్ట్రంలో తెలంగాణ తుది దశ ఉద్యమం జరగాల్సిన అవసరం ఉందని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి అన్నారు. తల్లిదండ్రుల పేర్లు తప్ప కేసీఆర్​ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే చెప్తారని మండిపడ్డారు. ‘‘రాష్ట్రం నంబర్​ వన్​ అని కేసీఆర్​ చెప్తున్నడు. కానీ, 3 వేల వైన్​ షాపులు, 60 వేల బెల్టు షాపులతో తెలంగాణ నంబర్​ వన్​ అయింది. తెలంగాణలో కేసీఆర్​ ఆలోచన వైన్​ షాపులు, బెల్టు షాపులే” అని దుయ్యబట్టారు. శనివారం చేవెళ్లలో సభలో రేవంత్​ మాట్లాడుతూ.. కేసీఆర్​చెప్పిందేమీ చేయలేదు. వచ్చేది కాంగ్రెస్​ సర్కారే అన్నారు.

 ‘‘ జనాభా దామాషా ప్రకారం అందరికీ సమానంగా రిజర్వేషన్లు పంచడం, అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేయడం.. ఇదే కాంగ్రెస్​ పార్టీ సిద్ధాంతం, ఆలోచన’’ అని ఆయన పేర్కొన్నారు.. తాము అభ్యర్థుల ఎంపిక, సామాజిక సమానత్వం, స్వేచ్ఛ కోసం ఎమ్మెల్యే టికెట్లకు అప్లికేషన్లు పిలిస్తే 1,200 అప్లికేషన్లు వచ్చాయని రేవంత్​ చెప్పారు. ‘‘కేసీఆర్​ రూ.లక్ష కోట్ల ఆస్తులు సంపాదించి.. 10 వేల ఎకరాల భూములను ఆక్రమించిండు. పేదలు 100 గజాల స్థలం కూడా కొనుక్కునే పరిస్థితి లేకుండా పోయింది” అని అన్నారు. ‘‘కేసీఆర్​ మంత్రి వర్గంలో ముగ్గురే బీసీలున్నరు. అందులో మాదిగలకు స్థానం లేదు. ఇటీవలి ఎమ్మెల్యే టికెట్లలో ఒక్క ముదిరాజ్​ కూడా లేరు. ఉద్యమకారులకు గుర్తింపు లేదు’’ అని  మండిపడ్డారు. 

చేవెళ్ల సెంటిమెంట్​

‘‘రాహుల్​ గాంధీ నేతృత్వంలో రైతు డిక్లరేషన్​, ప్రియాంక గాంధీ నేతృత్వంలో యూత్​ డిక్లరేషన్​ ప్రకటించినం. ఖమ్మంలో రూ.4 వేల పింఛన్​ను ప్రకటించినం. ఇప్పుడు దళిత, గిరిజనుల కోసం డిక్లరేషన్​ను ప్రకటిస్తున్నం” అని రేవంత్​ చెప్పారు. చేవెళ్ల గడ్డ కాంగ్రెస్​కు చాలా సెంటిమెంట్​ అని అన్నారు. 

రైతుబంధుతో దోచుకుంటున్నరు: సీతక్క

రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులను దళిత, గిరిజనులను పొందుతున్నారంటే దానికి కారణం కాంగ్రెస్​ పార్టీ, బీఆర్​ అంబేద్కర్​ అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.  ఎమ్మెల్యేలు, మంత్రులు కోట్ల రూపాయలు రైతుబందు పేరుతో దోచుకుంటున్నారన్నారు.

కాంగ్రెస్​తోనే అన్ని వర్గాలకు మేలు: బలరాం నాయక్​

ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్​ను తీసుకొచ్చింది సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్​ పార్టీనేనని, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్​ను ప్రకటించినట్లు కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్​ అన్నారు. అసైన్డ్​ ల్యాండ్స్​ను ఇచ్చింది ఇందిరా గాంధీ అని అన్నారు. అన్ని వర్గాలకూ కాంగ్రెస్​ హయాంలోనే మేలు జరుగుతుందని ఆయన చెప్పారు.

పేదల భూములను కేసీఆర్​ గుంజుకుంటున్నడు: భట్టి 

దళిత, గిరిజన బతు కుల బాగు కోసం డిక్లరేషన్​ను ప్రకటిస్తున్నా మని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అన్నింటిలోనూ వారిని హక్కుదారులుగా చేసేలా 12 పాయింట్లను డిక్లరేషన్​లో చేర్చామని చెప్పారు. ఆనాడు చేవెళ్ల నుంచి వైఎస్​ ప్రారంభించిన పాదయాత్రతో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్​ పంచిన భూములను కేసీఆర్​ పేదల నుంచి గుంజు కుంటున్నారని ఫైర్​ అయ్యారు. 

బెల్టు షాపుల తెలంగాణ: రాజనర్సింహ

తెలంగాణ పోరాటాలు అస్తిత్వం, భూ హక్కుల కోసం జరిగాయని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. బంగారు తెలంగాణ కాలేదని, బెల్టు షాపుల తెలంగాణ అయిందని మండిపడ్డారు. ‘‘దళితుడ్ని ముఖ్యమంత్రిగా చేయకుంటే తల నరుక్కుంటానని కేసీఆర్​ ఆనాడు అన్నడు. దళితులకు, గిరిజనులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నిలబెట్టుకోలేదు.   ” అని విమర్శించారు. ఆత్మగౌరవం కోసం తెలంగాణ తెచ్చుకున్నామని, కుటుంబ పాలన కోసం కాదని అన్నారు.