హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి బయటపడుతుందనే సీఎల్పీ టీమ్ పర్యటనను రాష్ట్ర సర్కార్ అండ్డుకుంటున్నదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లిన సీఎల్పీ నేతలు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, పొదెం వీరయ్యలను అరెస్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం పిరికిపందలా వ్యవహరించిందని మండిపడ్డారు. గోదావరి వరదలతో కాళేశ్వరం పంప్హౌసులతోపాటు ఇతర ప్రాజెక్టులకు భారీ నష్టం జరిగిందన్నారు. ఈ విషయం మేం చెప్తే పట్టించుకోకుండా ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరించిందని బుధవారం ప్రకటనలో మండిపడ్డారు.
అవినీతి, డిజైన్ లోపాలే శాపాలు
గతనెలలో అన్నారం, కన్నెపల్లి పంప్ హౌస్లు వరద నీళ్లలో మునిగాయని, కన్నెపల్లి పంప్ హౌస్ లో క్వాలిటీ లేకుండా కట్టిన ప్రొటెక్షన్ వాల్, దాంతోపాటే క్రేన్లు, లిఫ్ట్లు కూలడంతో మోటార్లు తుక్కుతుక్కు అయ్యాయన్నారు. డిజైన్ లోపం, అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టుకు శాపంగా మారాయని ఆరోపించారు. ఫలితంగా వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నారని రేవంత్ గుర్తుచేశారు. ప్రభుత్వం మాత్రం రూ.25 కోట్లే నష్టమైందని, అదికూడా కాంట్రాక్ట్ సంస్థే భరిస్తుందని ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్తో అబద్ధాలు ప్రచారం చేయించిందన్నారు. వాస్తవాలను ప్రజల తెలిపేందుకు పర్యటిస్తున్న భట్టి నేతృత్వంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల అడ్డుకుంటున్నారని తెలిపారు. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి నష్టం, అవినీతి జరగకుంటే దాన్ని చూపించడానికి కేసీఆర్ ఎందుకు వణుకుతున్నారని ప్రశ్నించారు. ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లిన సీఎల్పీ బృందాన్ని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నానని, అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.