తెలంగాణ ఎన్నికల కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. 120 రోజుల్లో నిర్వహించబడే తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు మొదలు పెట్టినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కార్యచరణలో భాగంగా బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడతామన్నారు. అలాగే కేంద్రంలో బీజేపీ అధికార దుర్వినియోగాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఈ మేరకు కాంగ్రెస్ స్ట్రాటజీ కమిటీలో ఈ అంశాలపై చర్చించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
ALSO READ:ఔటర్ రింగ్ రోడ్డుపై స్పీడ్ పెంచారు.. ఇక నుంచి 120పై వెళ్లొచ్చు
కర్ణాటకలో ఏ ఫార్ములాతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో అదే ఫార్ములాను తెలంగాణలో అమలు చేయబోతున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణలో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏం చేయనుందన్న దానిపై స్ట్రాటజీ మీటింగ్ లో చర్చించామని..అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల అభివృద్ధిపై ప్రత్యేక చర్చ జరిగిందన్నారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలన అవినీతి మయమైందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అవినీతి ఆకాశానికి పెరిగితే అభివృద్ధి పాతాళంలోకి పడిపోయిందన్నారు. ముఖ్యమైన నాయకులు అందరూ కలిసి బీఆర్ఎస్ ను గద్దె దించేందుకు కృషి చేస్తామని చెప్పారు.