నిరుద్యోగులకు ఒక్కొక్కరికి 1.60లక్షల నిరుద్యోగ భృతి ఇవ్వాలి: రేవంత్

నిరుద్యోగులకు ఒక్కొక్కరికి 1.60లక్షల  నిరుద్యోగ భృతి ఇవ్వాలి: రేవంత్

రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులకు ఒక్కొక్కరికి లక్షా 60 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ లో నిరుద్యోగ నిరసన ర్యాలీలో రేవంత్ మాట్లాడారు.  పేపర్ లీక్ ఘటనలో  కేటీఆర్ ను బర్తరఫ్ చేయడంతో పాటు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీఎస్ పీఎస్ సీ ప్రశ్నా పత్రాలు ఇవాళ బజార్లో అమ్ముకునే పరిస్థితి వచ్చిందంటే..  టీఎస్ పీఎస్ సీ బోర్డుపై నమ్మకం పోయిందన్నారు. 

తెలంగాణకు పట్టిన కొరివి దయ్యం కేసీఆర్ అని..  రాష్ట్ర పొలిమెరల వరకు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు రేవంత్. రాష్ట్రం వచ్చినప్పుడు లక్షా 7 వేల ఉద్యోగాలు ఖాళీలు ఉంటే.. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి కానీ.. కష్టపడి చదివిన పేద విద్యార్థులకు ఉద్యోగాలు రాలేదన్నారు.  రాష్ట్రంలో కేసీఆర్  కుటుంబం బాగుపడ్డది తప్ప..ప్రజలు బాగుపడలేదన్నారు. 

ఆదిలాబాద్ కు జోగు రామన్మ చేసిందేమి లేదని.. కేసీఆర్ ఫామ్ హౌజ్ కు వెళ్లి పడుకుండని విమర్శించారు. జోకుడుతోనే జోగురామన్న మంత్రి ఆయన కొడుకు మున్సిపల్ చైర్మన్ అయ్యిండని ఆరోపించారు. రాజయ్య తరహాలోనే జోగురామన్నను బర్తరఫ్  చేయాలన్నారు. కొత్త సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని.. ఆదిలాబాద్ ను దత్తత తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

ప్రశ్నాపత్రాలు అమ్ముకున్న బండి సంజయ్ ఒక్క రోజులోనే జైలు నుంచి బయటకు ఎలా వచ్చారని ప్రశ్నించారు రేవంత్.  రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ముస్లీం రిజర్వేషన్లను రద్దు చేస్తానన్న అమిత్ షా వ్యాఖ్యలపై ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు  మాట్లాడటం లేదని ప్రశ్నించారు.  ఆదిలాబాద్ లో 10 స్థానాలు గెలిపిస్తే..రాష్ట్రంలో 90 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.