- భారమంతా రేవంత్‌పైనే
- పార్టీ అభ్యర్థుల తరఫున సుడిగాలి ప్రచారాలు
- కాంగ్రెస్ సీనియర్లంతా సొంత నియోజకవర్గాల్లోనే
- స్టార్ క్యాంపెయినర్ల లిస్టును ఇంకా విడుదల చెయ్యని హైకమాండ్
- బీఆర్ఎస్ తరఫున కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీశ్ ప్రచారం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రచారం జోరుగా సాగుతున్నది. అభ్యర్థులంతా ఎవరి నియోజకవర్గాల్లో వాళ్లు ప్రచారం చేసేసుకుంటున్నారు. లీడర్లంతా వారి వారి నియోజకవర్గాల్లోనే మోహరించారు. అయితే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం అభ్యర్థులందరినీ అర్సుకుంటున్నారు. ఆయనొక్కడే సుడిగాలి పర్యటనలు చేస్తూ వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. ఆయన బరిలో నిలిచిన కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఒకట్రెండు రోజులు ప్రచారం చేసిన రేవంత్.. మిగతా సమయాన్నంతా ఇతర నియోజకవర్గాల్లో ప్రచారానికే వాడుతున్నారు.
వారం రోజుల్లోనే దాదాపు 20 సెగ్మెంట్లలో ప్రచారం చేశారు. మరో వైపు మిగతా నియోజకవర్గాల అభ్యర్థులూ తమ నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేయాల్సిందిగా రేవంత్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, అధికార బీఆర్ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్తమ అభ్యర్థుల తరఫున నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంటే.. కాంగ్రెస్‌లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. టైం తక్కువగా ఉండడంతో ప్రచార భారమంతా ఒక్క రేవంత్‌పైనే పడిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.
పెద్ద లీడర్లంతా సొంత సెగ్మెంట్లలోనే
కాంగ్రెస్ పార్టీలోని పెద్ద లీడర్లంతా తమ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు. సెగ్మెంట్లోని అన్ని ఊర్లను చుట్టేస్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణా రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి లీడర్లు తమ సొంత నియోజకవర్గాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
నామినేషన్ల ప్రక్రియ మొదలైన దగ్గర్నుంచి సొంత నియోజకవర్గాల్లోనే తిరుగుతున్నారు. కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీస్తుండడంతో ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ప్రచారంలో తలమునకలయ్యారు. వాళ్లంతా వారి గెలుపు కోసమే శ్రమిస్తుండడంతో మిగతా నియోజకవర్గాల్లో రేవంత్ ఒక్కరే ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
స్టార్ క్యాంపెయినర్ల లిస్టూ విడుదల కాలే..
మామూలుగా ఎన్నికలప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ స్టార్ క్యాంపెయినర్లను నియమిస్తుంటుంది. అభ్యర్థుల తరఫున వారు వివిధ నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తుంటారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి వాళ్లు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. అయితే, ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ పూర్తైనా.. ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లను హైకమాండ్ నియమించలేదు.
ఆ ప్రభావం వల్ల కూడా నేతలు ఇతర నియోజకవర్గాలపై దృష్టి సారించడం లేదన్న చర్చ జరుగుతున్నది. హైకమాండ్ వీలైనంత త్వరగా స్టార్ క్యాంపెయినర్లను నియమిస్తే రేవంత్‌పై భారం తగ్గుతుందని పార్టీ వర్గాల్లో
చర్చ జరుగుతున్నది.
అన్ని సెగ్మెంట్లలో బీఆర్ఎస్ మంత్రుల ప్రచారం..
కాంగ్రెస్‌లో పరిస్థితి ఇలా ఉంటే.. అధికార బీఆర్ఎస్ పార్టీలో మాత్రం సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కూడా అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్ ఒక్కరే అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ సమన్వయం చేసుకుంటే.. ఇప్పుడు ఆయనపై భారాన్ని తగ్గిస్తూ కేటీఆర్, హరీశ్ కూడా ప్రచార బాధ్యతలను మోస్తున్నారు. దీంతో తక్కువ టైంలో ఎక్కువ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా, ఎవరిపైనా భారం ఉండకుండా చూసుకుంటున్నారు.