అధికారంలో రాగానే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం : రేవంత్ రెడ్డి

దళిత, గిరిజనులకు కాంగ్రెస్ కు ఉన్న ప్రేమ ఏ పార్టీకి ఉండదన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ కంటే ముందు దళితులు, ఆదివాసీలకు ఎవరైనా భూములు ఇచ్చారా..? లేదా అనే విషయాన్ని ఆలోచన చేయాలని కోరారు. కాంగ్రెస్ ఐటీడీఏ ప్రాజెక్టులు ప్రారంభించిందన్నారు. ధరణి పోర్టల్ తీసుకువచ్చి అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంటోందని ఆరోపించారు. దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ దగ్గర నోట్లు ఉంటే.. తమ అభ్యర్థుల దగ్గర ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అభివృద్ది చేయించే బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇంద్రవెల్లి కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేస్తానని, ఆ బాధ్యత కూడా తనదే అన్నారు.

సమైక్యపాలనలో జరిగిన దురాగతాలకు న్యాయం చేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ కు అబద్దాలు చెప్పడంలో ప్రైజ్ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తారంటూ కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతి ఉండే మాట్లాడుతున్నారా..? అని ప్రశ్నించారు. రైతుబంధును 2018లో ప్రవేశపెట్టారని, ధరణి పోర్టల్ ను మాత్రం 2020లో తీసుకొచ్చారని, మరి ఆ రెండేళ్లు లబ్ధిదారులకు రైతుబంధు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పేదల భూములను కంప్యూటరీకరణ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందన్నారు. ఈ దేశంలో కాంగ్రెస్  పార్టీనే కంప్యూటర్ తెచ్చిందన్నారు. 

ధరణి స్థానంలో మంచి పోర్టల్ తీసుకొస్తామన్నారు. ఎవరికీ నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ హయంలో ఇచ్చిన భూములకు పట్టాలు ఇస్తామని, వాటిని అమ్ముకునే సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పారు. ధరణి పోర్టల్ ని బంగాళాఖాతాలో కలుపుతామన్నారు. భూముల మీద హక్కులు కల్పిస్తామని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ 10 వేల ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దాలే ఆడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ హయంలో రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. ఉట్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడారు. 

గిరిజనులు, ఆదివాసీల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి చేసిందన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదనే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. కాంగ్రెస్ ఉంటేనే తెలంగాణ వచ్చిందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోయి ఉంటే కేసీఆర్ కుటుంబం బిచ్చమెత్తుకుని బతికేవాళ్లు అంటూ మాట్లాడారు. ఖానాపూర్ నియోజకవర్గంలో కరెంటు రాని గ్రామాలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు.