నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ లీడర్లు సీనియర్లపై గుర్రుగా ఉన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నా తమకు తగిన గౌరవం దక్కడంలేదని నారాజ్ అవుతున్నారు. జిల్లాలోని అసెంబ్లీ సీట్లన్నీ వారి చేతుల్లోనే ఉండడం వారికి మింగుడుపడడంలేదు. ఇటీవల నల్గొండలో జరిగిన నిరుద్యోగ ర్యాలీ, సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేసిన తమను కనీసం వేదిక మీదికి కూడా రానివ్వకుండా అవమానించారని అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలనుంచి టికెట్ ఆశిస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గీయులే ఈ సభకు జనాన్ని తరలించారు. పార్టీ కోసం పని చేస్తున్న తమకు కనీస గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదని గురువారం నల్గొండకు వచ్చిన సీఎల్పీ మాజీ నేత జానారెడ్డికి వారు ఫిర్యాదు చేశారు. సభ సక్సెస్ కావడానికి ఏమాత్రం కృషి చేయని వారిని ఆకాశానికెత్తేశారని, ఇది తమను రాజకీయంగా దెబ్బ తీసే కుట్రలో భాగమేనని రేవంత్ వర్గానికి చెందిన బీసీ, ఎస్సీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
పేర్లు కూడా ప్రస్తావించలే..
ఉమ్మడి జిల్లాలో రేవంత్ వర్గానికి చెందిన చల్లమల్ల కృష్ణారెడ్డి, బీర్ల అయిలయ్య, పటేల్ రమేశ్‌రెడ్డి, కొండేటి మల్లయ్య, పున్నా కైలాశ్‌నేత, చెరుకు సుధాకర్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి నిరుద్యోగ సభకు జనాన్ని సమీకరించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్న వీరంతా నల్గొండ, నకిరేకల్, ఆలేరు, భువనగిరి, మునుగోడు, దేవరకొండ, సూర్యాపేట సెగ్మెంట్ల నుంచి, ఎంజీ యూనివర్సిటీ, కోచింగ్ సెంటర్ల నుంచి నిరుద్యోగులను సభకు తరలించేందుకు కష్టపడ్డారు. ఇందుకోసం ఖర్చులన్నీ తామే భరించామని, అయినా కనీసం తమ తమ పేర్లు కూడా మీటింగ్‌లో ప్రస్తావించ లేదని ఆవేదన చెందుతున్నారు. నల్గొండ, నకిరేకల్, సూర్యాపేటలో పార్టీ సభత్వ నమోదు కార్యక్రమాన్ని సీనియర్లు పట్టించుకోలేదని, తామే సభ్యత్వ నమోదు చేయించామని, గాంధీభవన్‌లో ఆ రికార్డులన్నీ ఉన్నాయంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉత్తమ్, జానా, వెంకట్‌రెడ్డి కుటుంబసభ్యులకు, అనుచరులకే 9 సీట్లు కేటాయించే అవకాశం ఉందని, మిగిలిన తుంగతుర్తి, నకిరేకల్, దేవరకొండ రిజర్వుడ్ సీట్లలో కూడా కాండిడేట్లను వాళ్లే డిసైడ్ చేస్తారని ఆశావహులు అంటున్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎంత చాకిరీ చేసినా ఆశావహులకు టికెట్ వస్తుందన్న గ్యారెంటీ లేకుండా పోయింది. నిజానికి నల్గొండ, ఆలేరు, నకిరేకల్, సూర్యాపేట, మిర్యాలగూడ, మునుగోడు సెగ్మెంట్లలో కొత్త లీడర్లు రావడంతోనే కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. అయితే సీనియర్ నేతలు కావాలనే రేవంత్ వర్గానికి చెందిన లీడర్లకు ప్రియారిటీ ఇవ్వలేదన్న ప్రచారం జరుగుతోంది.