ఉచిత కరెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని, కల్వకుంట్ల ఫ్యామిలీ కరెంట్ ఊడబీకుతామని, వాళ్లకు ఫ్యూజులు లేకుండా చేస్తామని పీసీసీ చీఫ్ రేవంత్‍రెడ్డి హెచ్చరించారు. రైతులకు ఉచిత కరెంట్‌ఇవ్వడం కాంగ్రెస్ పేటెంట్ అని, ఉచిత కరెంట్‌ను మొదలుపెట్టిందే కాంగ్రెస్ అని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా రైతులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను ఫ్రీగా అందిస్తామని స్పష్టం చేశారు.
మంగళవారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్‍పూర్ నియోజకవర్గం శివునిపల్లిలో, వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని లక్ష్మీపురం, కామారెడ్డి విజయభేరి సభల్లో రేవంత్‍రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నిన్న మొన్న యాడ చూసినా కేసీఆర్ అంటుండు.. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని. నేను చెప్పదలుచుకున్న ఆ సన్నాసులకు. బిడ్డా.. కాంగ్రెస్ రాంగనే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‍రావు, దయాకర్‍రావు, కవితరావు కరెంట్ ఊడబీకుత. మీకు ఫ్యూజులే ఉండవ్. మీ మోటార్లు కాలుతయ్. మీ ట్రాన్స్ఫార్మర్లు పేలుతయ్..” అని హెచ్చరించారు.
నాడు రైతులకు 9 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ అని, అధికారంలోకి వచ్చాక వ్యవసాయానికి 24 గంటల ఉచిత, నాణ్యమైన కరెంట్ఇస్తామని అన్నారు. ఇండ్లకు కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీగా విద్యుత్ సప్లయ్ చేస్తామని ప్రకటించారు. ‘‘పట్నాల్లో ఉన్న పేదలైనా, పల్లెటూర్లలో ఉన్న పేదలైనా వచ్చే నెల కేసీఆర్ ఓడిపోతే ఇంటి కరెంట్ బిల్లు కట్టాల్సిన పనిలేదు. 200 యూనిట్ల వరకు కరెంట్‌ను కాంగ్రెస్ప్రభుత్వం ఉచితంగా ఇస్తది” అని స్పష్టం చేశారు. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు బంద్ అంటవా కేసీఆర్..? నీ బొంద బందైతది. నీకన్నా పెంచి రైతు భరోసా స్కీం కింద ఎకరానికి రూ. 15 వేలు ఇస్తం. ఇండ్లు లేని వారికి ఇండ్ల స్థలాలు ఇస్తం. రూ 5 లక్షలు సాయం జేస్తం. చదువుకునే పిల్లలకు రూ. 5 లక్షల సాయం అందిస్తం. ఇప్పుడున్న 2 వేల పింఛన్ 4 వేలు జేస్తం. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచుతం’’ అని ఆయన అన్నారు.
కేసీఆర్.. మేడిగడ్డ బ్యారేజీ ఎట్లుందో చూద్దాంపా..!
‘‘కేసీఆర్ లక్ష కోట్లు దిగమింగి పేకమేడ బ్యారేజీ కట్టిండు. మేడిగడ్డ కుంగిపోయింది.. అన్నారం పగిలిపోయింది.. సుందిళ్లకు దిక్కులేదు’’ అని రేవంత్‍రెడ్డి మండిపడ్డారు. బుద్ధిమంతుడు పందిరేస్తే.. కుక్కతోక తాకి కూలిపోయిందన్నట్టుగా కేసీఆర్ యవ్వారం ఉందని విమర్శించారు. కుంగిన మేడిగడ్డను చూద్దామని వెళితే పోలీసోళ్లతో లాఠీచార్జ్ చేపిస్తున్నారని మండిపడ్డారు. ‘‘ప్రమాదంతో కూలిందని చెప్తున్నవ్ కదా? చూపించడానికి నీకొచ్చే అభ్యంతరమేమింటి” అని కేసీఆర్‌ను ఆయన ప్రశ్నించారు.
మనుమడిని మంత్రిని చేయనీకి ఓట్లు అడుతున్నడు
రాష్ట్రంలో కేసీఆర్ తన ఇంటోళ్లందరికీ ఉద్యోగాలిచ్చి టీవీలు, పేపర్లు పెట్టుకోవడం తప్ప.. పేదోళ్లకు ఇండ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వలేదని రేవంత్ అన్నారు. ‘‘కొడుకు, కూతురు, అల్లుళ్లకు పదవులివ్వడం అయిపోయింది. ఇప్పుడు మనుమడిని మంత్రిని చేయడం కోసం జనాలను ఓట్లు అడుగుతున్నడు. ఇందిరమ్మ ఇండ్లు డబ్బా ఇండ్లు.. డబుల్ బెడ్‍రూం ఇండ్లు ముద్దు అన్నడు. గజ్వేల్‍లో వెయ్యి ఎకరాల్లో వందల గదులతో గడి నిర్మించుకున్నడు. కేటీఆరేమో జన్వాడలో 100 ఎకరాల్లో రూ. 100 కోట్లతో ఓ గడి నిర్మించుకున్నడు. పంజాగుట్ట చౌరస్తాలో ప్రభుత్వ భూమి 10 ఎకరాల్లో 150 బెడ్‍రూంల ఇల్లును కేసీఆర్ కట్టుకున్నడు తప్పితే పేదలకు మాత్రం ఇండ్లివ్వలేదు” అని మండిపడ్డారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలిస్తే.. ఇప్పుడు 20వ తేదీ దాటినా రావట్లేదని అన్నారు.
ల్యాండ్ పూలింగ్ జీఓ ఇప్పటికీ రద్దు చేయలే
రాష్ట్రంలో వర్ధన్నపేటతో పాటు ఎక్కడా ల్యాండ్ పూలింగ్ జీవో రద్దు కాలేదని, ఎన్నికల్లో జనాలు తంతారనే ఆ అంశాన్ని పెండింగ్ పెట్టారని రేవంత్‍రెడ్డి అన్నారు. ‘‘వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం చేసిండు. దాన్ని ప్రశ్నిస్తే రైతులను పోలీస్ బూట్లతో తన్నించిండు. రైతులపై వాహనాలు ఎక్కించే ప్రయత్నం చేసిండు. 2014 కంటే ముందు తొడుక్కుందామంటే చెప్పులు సరిగ్గాలేని అరూరి రమేశ్ ఇప్పుడు వర్ధన్నపేట, వరంగల్, స్టేషన్ ఘన్‍పూర్ ఏరియాల్లో వేలాది ఎకరాల భూములు ఆక్రమించుకున్నడు” అని ఆరోపించారు.
ఎన్కౌంటర్ల కడియంను ఓడించాలె
‘‘స్టేషన్ ఘన్‍పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం ఎన్కౌంటర్లు చేయించిండని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజయ్యనే చెప్తున్నడు. రాజయ్య లీలల గురించి కడియం జెప్పిండు. ఒకరి గురించి ఒకరు వాళ్లే జెప్పిన్రు. వీళ్లద్దరి గురించి తెలిసిన కేసీఆర్ ఇద్దరి డిప్యూటీ సీఎం పదవులను గతంలో ఊడగొట్టిండు. కేసీఆరే వాళ్లను నమ్ముతలేడు. ఇగ జనం ఎందుకు నమ్ముతరు’’ అని రేవంత్ ప్రశ్నించారు. మంత్రులుగా పనిచేసిన కడియం, రాజయ్య ఇద్దరూ స్టేషన్ ఘన్‌పూర్‌కు కనీసం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, 100 పడకల హాస్పిటల్ తేలేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన యేడాదిలో ఈ రెండు హామీలు నెరవేర్చే బాధ్యత తనదేనని రేవంత్ చెప్పారు. ‘‘కేసీఆర్ అందరినీ తాగుబోతులను జేస్తుంటే.. ఆ ఖాళీ సీసాలను అమ్ముకుని పాలన చేసుకొమ్మని సర్పంచ్‌లకు చెప్పిన దద్దమ్మ పక్క నియోజకవర్గంలోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు’’ అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. ‘‘రేవంత్‍రెడ్డి సభలతో బిల్లా రంగలు కేటీఆర్, హరీశ్‌రావుకు వణుకు పుడుతున్నది. దొంగ నాటకాలతో ప్రచారానికి వస్తున్న కేసీఆర్ ఇక రెస్ట్ తీసుకోవాలి” అని అన్నారు.
కాంగ్రెస్ వస్తే.. కేబినెట్లో నలుగురు మహిళలకు చోటు
కేసీఆర్‌కు మహిళలంటే చిన్న చూపు అని, తెలంగాణలో బీఆర్ఎస్ మొదటి కేబినెట్లో ఒక్కరికి కూడా చోటియ్యలేదని రేవంత్ విమర్శించారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ బీఆర్ఎస్పార్టీ ఆరుగురు మహిళలకే టికెట్లు ఇస్తే కాంగ్రెస్ 12 మందికి ఇచ్చిందని అన్నారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, నలుగురు మహిళలకు మంత్రివర్గంలో చోటిస్తామని రేవంత్ ప్రకటించారు. ‘‘ఓడిపోతామనే భయంతో కేసీఆర్, కేటీఆర్, హరీశ్.. విపరీతంగా తిరుగుతున్నరు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే ఇబ్బంది ఉండేది కాదు. కానీ అడుగడుగునా మోసం జేసిన్రు.. అందుకే ఈ దుస్థితి’’ అని అన్నారు.
రైతుల భూములు గుంజుకునేందుకే..
కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని రేవంత్ అన్నారు. కేసీఆర్, ఆయన కొడుకు, బిడ్డ, అల్లుడు, సడ్డకుని కొడుకుకు ఉద్యోగాలు ఉన్నంత కాలం.. మన పిల్లలకు ఉద్యోగాలు రావన్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే ఏడాది తిరిగే లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ‘‘కామారెడ్డిలో రైతుల భూములు గుంజుకోవడానికే కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నడు. కేసీఆర్‌ను వేటాడేందుకే నేను వచ్చాను” అని చెప్పారు.
విచ్చలవిడిగా మద్యం దుకాణాలు..
కేసీఆర్ పాలనలో యువత బతుకులు ఆగమయ్యాయని రేవంత్ అన్నారు. ఉద్యోగాలు రాక.. ఇంట్లో ఏమీ చెప్పలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రవళిక అనే యువతి ఆత్మహత్య చేసుకుంటే ఆమెను, ఆమె కుటుంబాన్ని అవమానించేలా బీఆర్ఎస్ నేతలు మాట్లాడారని, మన ఇంట్లో అలా జరిగితే ఊరుకుంటామా అని ఆయన ప్రశ్నించారు. ‘‘ఆత్మ బలిదానాలు వద్దని, 2 లక్షల మంది యువతకు ఉద్యోగాలియ్యాలని సోనియమ్మ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది. కానీ కేసీఆర్ పాపాలభైరవుడిగా మారిపోయిండు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేల కూల్చి కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలి’’ అని అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం దుకాణాలను కేసీఆర్ తెరిచారని, తాగుబోతులను తయారు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘మొగుడు తాగినా ఆడబిడ్డలు సహిస్తరేమో కానీ కొడుకులు తాగుబోతులు అయితే ఏ తల్లీ తట్టుకోలేదు. అందుకే కేసీఆర్‌ను ఓడించాలి” అని ఆయన అన్నారు.
కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన అన్నవ్. మేడిగడ్డ బ్యారేజీ నిర్మించిన అన్నవ్. నువ్వు కట్టింది కుంగిపోయింది. ఆ రోజుల్లో బస్సులుపెట్టి, పండుగలు చేసి ఊరూర్ల నుంచి జనాలను తీస్కపోయినవ్. ఇయ్యాళ నువ్వు బస్సులు పెట్టకు. కిరాయి పైసలు ఇయ్యకు. మీడియా మిత్రులు, తెలంగాణ రైతులను తీసుకుని మేడిగడ్డ దగ్గరకు మేమే వస్తం. నువ్వు కట్టిన మేడిగడ్డ బ్యారేజీ ఎట్లుందో సూపియ్యు. పేకమేడలు కట్టి, ఇసుక కదిలితే బ్యారేజీ వంగిందని అంటున్నరు. బుద్ధున్నోడు.. అన్నం తినేటోడు ఎవడైనా ఇసుక మీద బ్యారేజీ కడ్తరా..
- పీసీసీ చీఫ్ రేవంత్‍రెడ్డి