ఆ రెండు పార్టీలదీ ఫెవికాల్ బంధం..ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు చీల్చడమే లక్ష్యం

  • పార్లమెంటు ఎన్నికలకు సీట్ల పంపకం జరిగింది
  • వచ్చే ఎలక్షన్లలో బీఆర్ఎస్ 9, బీజేపీ 7లో పోటీ చేస్తాయ్
  • కేసీఆర్ అవినీతిపై చెప్తున్న మోదీ చర్యలెందుకు తీసుకోలే
  • పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు

హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఫెవికాల్ బంధం ఉందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ రెండు పార్టీలు పార్లమెంటు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. ఈ మేరకు పొత్తు కుదిరిందన్నారు. బీఆర్ఎస్ 9, బీజేపీ 7 స్థానాల్లో పోటీ చేస్తాయన్నారు. ఒక స్థానాన్ని ఎంఐఎంకు వదిలేస్తారని వివరించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడమే బీజేపీ లక్ష్యమన్నారు. ఇవాళ గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..  నిజామాబాద్ లో సాక్షాత్తు మోదీనే రెండు పార్టీల మధ్య ఉన్న ఫెవికాల్ బంధాన్ని బయటపెట్టారన్నారు. మోదీ, కేసీఆర్ మధ్య పొత్తు బయటపడ్డందున ఎంఐఎం విధానమేంటో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ను గెలిపించడానికే మోదీ పదే పదే రాష్ట్రానికి వస్తున్నారని రేవంత్ అన్నారు.

 బీజేపీకి మొదటి నుంచి బీఆర్ఎస్ కు మద్దతుగా ఉందని ఆరోపించారు. కీలక బిల్లుల ఆమోదంలో బీజేపీ సర్కారుకు బీఆర్ఎస్ మద్దతిచ్చిందని చెప్పారు.  మోదీ తొమ్మిదేళ్ల పాలనలో విపక్ష సీఎంలపై ఈడీ దాడులు జరిగాయని, సీఎం కేసీఆర్ పై ఎందుకు చేయలేదన్నారు. సీఎం కేసీఆర్ అవినీతి చేశారని  ఆరోపణలు చేసినప్పుడు  మోదీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.  బీఆర్ఎస్ అవినీతి చేస్తుంటే కేంద్రం ఏం చేస్తోందన్నారు. కేసీఆర్ పై చర్యలు తీసుకోకపోవడానికి వాటాలు, మూటలే కారణమని ఆరోపించారు. కొడుకును సీఎం చేయడం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడంపై  కేసీఆర్ ప్రధాని మోదీతో చర్చించారని తెలిపారు. వీరిద్దరు ఒకటేనని చెప్పడానికి ప్రధాని వ్యాఖ్యలే నిదర్శనమన్నారు.