- బంగారు తెలంగాణ పేరు చెప్పి తాగుబోతుల అడ్డాగా మార్చిండు: రేవంత్
- కేసీఆర్ ఇక ఫామ్‌హౌస్‌లో రెస్ట్ తీసుకోవాల్సిందే
- ప్రజల ఉసురు తగిలి ఈ ఎన్నికల్లో కొట్టుకుపోతడు
- నర్సాపూర్, పరకాల సభల్లో వ్యాఖ్యలు
నర్సాపూర్/పరకాల, వెలుగు: తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం కేసీఆర్ అని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ‘‘ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి కేకల రాజ్యం అని కేసీఆర్ మతి తప్పి మాట్లాడుతున్నడు. ఇందిరమ్మ రాజ్యం లేకపోతే, సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇయ్యకపోతే కేసీఆర్ ఫ్యామిలీ నాంపల్లి దర్గా దగ్గర, బిర్లా మందిర్ మెట్ల మీద అడుక్కుతినేది. ఇందిరమ్మ రాజ్యాన్ని విమర్శించినందుకు కేసీఆర్ వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని, గతంలో కాంగ్రెస్ బలపరిస్తేనే సిద్దిపేటలో కేసీఆర్ సింగిల్ విండో డైరెక్టర్ అయ్యారని, ఆనాడు కేసీఆర్ ను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించింది ఇందిరమ్మ కొడుకు సంజయ్ గాంధీ అని తెలిపారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో, హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభల్లో రేవంత్ మాట్లాడారు. తెలంగాణలోని మారుమూల పల్లెల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి నిలువ నీడనిచ్చిన పార్టీ కాంగ్రెస్ అని.. గిరిజనులు, దళితులు, పేదలకు 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పంచి ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేసిన పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. ‘‘12 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చిన పార్టీ.. నాగర్జునసాగర్, శ్రీశైలం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు కట్టి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన పార్టీ.. స్థానిక సంస్థల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు కల్పించిన పార్టీ.. హైదరాబాద్‌లో ఓఆర్ఆర్, ఫ్లై ఓవర్లు, మెట్రో రైలు సౌకర్యం, ఐటీ, ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్‌పార్టీ.. అదే ఇందిరమ్మ రాజ్యం’’ అని ఆయన తెలిపారు.
కేసీఆర్ ఇక ఫామ్‌హౌస్‌కే
రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతున్నదని, రాచరిక పాలన సాగుతున్నదని రేవంత్ మండిపడ్డారు. ‘‘ఇక కేసీఆర్ పాలనకు కాలం చెల్లింది. ఆయన ఇక ఫామ్‌హౌస్‌లో రెస్ట్ తీసుకోవాల్సిందే” అని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పిన కేసీఆర్ బొందలగడ్డగా మార్చారని ఆయన మండిపడ్డారు. ‘‘ఊరూరా బెల్ట్ షాపులు తెరిచి దేశంలోనే నంబర్ వన్ తాగుబోతుల అడ్డాగా మార్చిండు. మాట్లాడితే కేసీఆర్ అన్నింటా తెలంగాణ నంబర్ వన్ అని చెప్తున్నడు. కానీ రాష్ట్రం అభివృద్ధిలో కాకుండా రైతుల ఆత్మహత్యల్లో నంబర్ వన్ గా, నిరుద్యోగ సమస్య లో నంబర్ వన్‌గా మారింది” అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రొ. జయశంకర్ స్వగ్రామం అక్కంపేటతో పాటు, ఆయన స్మారక స్తూపం , పరకాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసే బాధ్యతను పీసీసీ అధ్యక్షుడిగా తానే తీసుకుంటానని రేవంత్ హామీ ఇచ్చారు.
దొరల రాజ్యాన్ని బొందపెట్టాలి
‘‘రాష్ట్రంలో దొరల రాజ్యం కావాల్నా.. ఇందిరమ్మ రాజ్యం రావాల్నా.. ప్రజలే తేల్చుకోవాలి. దొరల గడీల ముందు బానిసలుగా బతుకుదామా.. ఇందిరమ్మ రాజ్యంలో కాలర్ ఎగరేసుకుని బతుకుదామా ఆలోచన చేయాలి” అని రేవంత్ అన్నారు. ప్రశ్నించిన గొంతులు, ప్రజల తరఫున కొట్లాడే వాళ్లను సీఎం కేసీఆర్ అణచివేసి, అక్రమ కేసులతో జైలులో పెట్టేందుకు కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ గెలిస్తే సమస్యలన్నీ పరిష్కరిస్త
హైదరాబాద్/ఖైరతాబాద్: కాంగ్రెస్ ను గెలిపిస్తే సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం నాంపల్లి, ఫిలింనగర్లో నిర్వహించిన రోడ్ షోలో రేవంత్ మాట్లాడారు. ‘‘20 ఏండ్లుగా ఎంఐఎం మాటలు నమ్మి మోసపోయారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తా. బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐంఎం చేతిలో ఉందని చెప్పే అసద్... భోజగుట్ట, శ్రీరాంనగర్, వివేకానంద నగర్, శివాజీ నగర్ బస్తీల్లోని పేదలకు ఇండ్ల పట్టాలు ఎందుకు ఇప్పించలేదు? ఫిరోజ్‌ఖాన్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి. బీజేపీకి ఓటేస్తే.. మూసిలో పోయినట్టే”అని రేవంత్ విమర్శించారు. ఖైరతాబాద్ అంటే గుర్తుకొచ్చేది ఒకటి వినాయకుడు, రెండోది పి.జనార్ధన్ రెడ్డి అని అన్నారు. 20 ఏండ్ల తర్వాత పీజేఆర్ ఫ్యామిలీకి ఓటు వేసే అవకాశం వచ్చిందని తెలిపారు. ‘‘దానం నాగేందర్ సగం హైదరాబాద్‌ను ఆక్రమించుకున్నడు. చింతల పాత చింతకాయ పచ్చడే.. ఆయన గుడికే కాదు.. మీకూ పంగనామాలు పెట్టిండు. పంజాగుట్టలో బీడీలు అమ్ముకున్న దానంను ఎమ్మెల్యే, మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించడం సిగ్గుచేటు”అని రేవంత్ మండిపడ్డారు.