- ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకుంటలే
- బిల్లులు రిలీజ్ చేయకుండా వేధిస్తుండు: రేవంత్ రెడ్డి
- ఇసుకలో పిల్లర్లు వేసిన మేధావి కేసీఆర్.. మేడిగడ్డ బ్యారేజీ ఆయన అవినీతికి బలైంది
- ఇందిరమ్మ ఇండ్లు ఉన్నచోట మేము ఓట్లు అడుగుతం
- డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించిన చోటనే కేసీఆర్ ఓట్లు అడగాలని సవాల్
సీఎం కేసీఆర్‌కు సర్పంచుల ఉసురు తగులుతుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బిల్లులు రిలీజ్ చేయకుండా వేధిస్తున్నాడని మండిపడ్డారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్, నిర్మల్, జనగామ, కామారెడ్డిలో నిర్వహించిన ప్రచార సభల్లో రేవంత్ పాల్గొని మాట్లాడారు. తండాలు, గూడేలను పంచాయతీలుగా మార్చానని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్.. ఎన్ని చోట్ల పంచాయతీ బిల్డింగులు కట్టించాడో చెప్పాలన్నారు. ఆదివాసీలు, లంబాడా సర్పంచులు అప్పులు చేసి గ్రామాల్లో పనులు చేయించారని, ఇజ్జత్ కోసం కొందరు భార్య మెడలోని పుస్తెలు అమ్మి మరీ పనులు పూర్తి చేశారని చెప్పారు. చివరికి ప్రభుత్వం నుంచి బిల్లులు రాక ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న కేసీఆర్.. సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
.ఇసుకలో పిల్లర్లు వేసిన మేధావి కేసీఆర్
ఇసుకలో పిల్లర్లు వేసిన మేధావి కేసీఆర్ అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘మేడిగడ్డ ప్రాజెక్టు సీఎం అవినీతికి బలైంది. ‘గుడిని.. గుడిలో లింగాన్ని మింగేశారు’ అనే సామెతకు కేసీఆర్కరెక్టుగా సరిపోతాడు. ‘నేనే లాయర్, ఇంజనీర్, డాక్టర్, సైంటిస్ట్’ అని గొప్పగా చెప్పుకుంటున్న కేసీఆర్ 80 వేల పుస్తకాలు చదివిండో లేదో తెలియదు కానీ.. రూ.లక్షల మద్యం మాత్రం తాగి ఉంటాడు. ఖాళీ మద్యం సీసాలు అమ్ముకోవాలని సర్పంచులకు చెబుతున్న దద్దమ్మ దయాకర్‌ను మంత్రిని చేసిండంటే ఏమనాలె? దేంతోని కొట్టాలె? గజ్వేల్ ఫామ్‌హౌస్‌లోని ఖాళీ సీసాలను నువ్వు అమ్ముకుంటున్నవా దయాకర్?” అని మండిపడ్డారు. మొన్నటి దాకా ఫామ్‌హౌస్‌లో పడుకున్న కేసీఆర్.. తుక్కుగూడ సభలో గ్యారంటీ స్కీములను సోనియా గాంధీ ప్రకటించడంతో ఉలిక్కిపడి లేచాడని, ఊరూరు తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ‘‘ఆదివాసీలు, లంబాడీలు కాంగ్రెస్ పార్టీకి రెండు కండ్లు. తెలంగాణ వచ్చాక కూడా వారు అత్యంత వెనుకబాటుకు గురయ్యారు. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారికి సమాన అవకాశాలు కల్పించాం. రెండు పార్లమెంట్ స్థానాలు ఇచ్చి గౌరవించుకుంటాం” అని హామీ ఇచ్చారు. ప్రజా పాలన రావాలనే సీపీఐ, టీజేఎస్ పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచాయని రేవంత్ చెప్పారు. ఆదిలాబాద్, పాలమూరు జిల్లాలు ఉమ్మడి ఏపీలో ఎలా ఉన్నాయో.. నేటికీ అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే.. 30న బోథ్‌ను రెవెన్యూ డివిజన్ చేస్తామని, 31న కుప్టీ ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని ప్రకటించారు.
దొర గడీల బానిస పల్లా రాజేశ్వర్ రెడ్డి
బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, జేడీఎస్ పార్టీలు దుష్టచతుష్టయంలా మారాయని, ఎలాగైనా కాంగ్రెస్ ను ఓడించాలని చూస్తున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు నాలుగు పార్టీల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో బీఆర్ఎస్ను ఓడించాలన్నారు. కేటీఆర్, హరీశ్‌రావు బిల్లా రంగాలు అని, కేసీఆర్ దోపిడీ దొంగ అని విమర్శించారు. ముగ్గురు కలిసి హైదరాబాద్ చుట్టుపక్కల 10 వేల ఎకరాలు కబ్జా పెట్టారని ఆరోపించారు. జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి దొర గడీల బానిస అని మండిపడ్డారు. కేసీఆర్‌కు సారాలో సోడా కలిపే పల్లాను ఓడించి, జనం కోసం, జనగామ అభివృద్ధి కోసం పాటుపడే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ‘‘పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్రమాలు.. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి బాగా తెలుసు. యాదగిరిరెడ్డి బాగోతం పల్లాకు తెలుసు. ఈ ఇద్దరి బాగోతం గడీల్లో ఉండే కేసీఆర్ దొరకు తెలుసు’’ అని రేవంత్అన్నారు. 45 ఏండ్లు పెంచి పోషిస్తే 80 ఏండ్ల వయస్సులో పార్టీ మారి పొన్నాల లక్ష్మయ్య తన పాతివ్రత్యం చెడగొట్టుకున్నాడని విమర్శించారు.
ఇంద్రకరణ్ రెడ్డిని బొంద పెట్టాలి
తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దొరల చేతిలో బందీ అయిందని రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్అధికారంలోకి రాగానే ప్రతి పేద కుటుంబానికి ఫ్రీగా కరెంట్అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రూపులు, గుంపులు పక్కన పెట్టి నిర్మల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్‌రెడ్డిని రాజకీయంగా బొంద పెట్టాలని, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరిరావును గెలిపించాలని పిలుపునిచ్చారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించేందుకు ప్లాన్‌చేస్తే.. కేసీఆర్ తన స్వలాభం కోసం పక్కన పెట్టారని ధ్వజమెత్తారు. లక్ష కోట్లు కొట్టేసేందుకు కాళేశ్వరం పేరిట డ్రామాకు తెరలేపాడని, రీడిజైన్ పేరుతో అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. మామా అల్లుళ్ల(కేసీఆర్, హరీశ్‌రావు) చేతిలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అన్యాయానికి గురైందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఉన్నచోట తాము ఓట్లు అడుగుతామని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించిన చోట కేసీఆర్ ఓట్లు అడగాలని సవాల్ చేశారు.
ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి
రైతులకు 24 గంటల ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని చెబుతున్న కేసీఆర్.. బహిరంగ చర్చకు సిద్ధమా అని రేవంత్‌రెడ్డి సవాల్‌విసిరారు. ఉచిత కరెంట్ పై మాట్లాడేందుకు కామారెడ్డి చౌరస్తాకు రావాలన్నారు. ‘‘కాంగ్రెస్ నిబద్ధత గురించి మాట్లాడుతున్న కేసీఆర్.. విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని తీసుకుని బహిరంగ చర్చకు రావాలి. నేను, షబ్బీర్‌అలీ వస్తాం. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల, సూర్యాపేట.. ఎక్కడికైనా పోదాం. ఏ సబ్‌స్టేషన్‌కైనా వెళ్దాం. లాగ్‌బుక్ లు తీసుకొని చూద్దాం. 24 గంటలు ఉచితంగా కరెంట్అందుతున్నట్లు తేలితే కామారెడ్డి, కొడంగల్నామినేషన్లను ఉపసంహరించుకుంటా’’ అని రేవంత్ సవాల్ చేశారు. లేకుంటే కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌చేశారు. కాంగ్రెస్‌వస్తే కేసీఆర్ ఫ్యూజులు పోవడం ఖాయమన్నారు. కేసీఆర్2004, 2023లో సమర్పించిన అఫిడవిట్లు పరిశీలిస్తే ఆస్తులు ఎన్ని వందల శాతం పెరిగాయో తెలుస్తుందన్నారు. కామారెడ్డి ప్రజల తీర్పు కోసం దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నిక ధర్మానికి, అధర్మానికి మధ్య నడుస్తున్నదన్నారు.