సీఎం కేసీఆర్ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మోసం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాజన్న సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. నాటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఆశీర్వాదంతో వేములవాడ నియోజకవర్గానికి అది శ్రీనివాస్ గోదావరి జలాలు తీసుకు వచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ వస్తే..నీళ్ళు, నిధులు వస్తాయని అనుకుంటే...కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నీళ్ళు రాలేదు..నిధులు రాలేదని విమర్శించారు. తనకు వేములవాడలోనే పెండ్లి అయిందని..ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇక్కడి ప్రజలను మోసం చేశారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయం ఎదుట రేవంత్ రెడ్డి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు.
వేములవాడలో ఎమ్మెల్యేగా రమేష్ బాబు గెలిపించి ప్రజలు ఓడి పోయారని రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేను కలవాలంటే జర్మనీ పోవాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తరఫున నిలబడి ఓడిన అది శ్రీనివాస్ ప్రజల మధ్యలో ఉన్నారని గుర్తు చేశారు. మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. గేదెకు గడ్డి వేసి, ఆవుకు పాలు పిండితే వస్తాయా అని ప్రశ్నించారు. మనమిచ్చిన అధికారం కేసీఆర్ దగ్గర నుంచి గుంజు కోవాలని సూచించారు. ఆత్మ గౌరవం పెరగాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. కేసీఆర్ కు నెత్తి మీద అప్పు...చేతిలో చిప్ప ఉందని ఎద్దేవా చేశారు. కొత్త ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. పేద ప్రజలకు ఇబ్బంది కలిగేలా సిలిండర్ ధరలు పెంచారని....కాంగ్రెస్ పాలనలో రూ. 500లకే సిలిండర్ ఇస్తామని భరోసా ఇచ్చారు. రాజన్న ఆలయం కోసం ఎన్ని నిధులు అయిన వెచ్చించి అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.