ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్​ ఆఫీసుకు నిప్పు : రేవంత్ రెడ్డి

చండూరు, వెలుగు : కాంగ్రెస్ పార్టీ ఆఫీసు, కార్యకర్తల జోలికి వస్తే బంగారిగడ్డలో చెట్టుకు కట్టేసి కొడతామని టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డలో పర్యటించి మాట్లాడారు. ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ ​ఆఫీసును తగలబెట్టారని, ఇలాంటి చర్యలను సహించేది లేదన్నారు.

ఈ ఎన్నికలు ప్రజలు కోరుకుంటేనో, ఎమ్మెల్యే చనిపోతేనో రాలేదని కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోసమే వచ్చాయన్నారు. 22 వేల కోట్లకు అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఓట్ల అడగడానికి వస్తున్నారని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు 60 మంది చనిపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ​పట్టించుకోలేదన్నారు. అభివృద్ధి కోసం ఆడబిడ్డగా ముందుకు వచ్చిన పాల్వాయి స్రవంతిని గెలిపించాలని కోరారు.