నల్లగొండ జిల్లాలో 9 మంది అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా అభివృద్ధిలో మాత్రం శూన్యం అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ లో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో జరిగిన సన్నాహక సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. నల్లగొండ జిల్లాకు గొప్ప చరిత్ర ఉందని అన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ముగ్గురు ఎమ్మేల్యేలు గెలిస్తే టీఆర్ఎస్ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు గెలిచారని అయినా అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. జిల్లాలో ప్రతి ప్రాజెక్టును కాంగ్రెస్ హయాంలోనే కట్టారని, అసంపూర్తిగా మిలిగిపోయిన ప్రాజెక్టులను ఇప్పటికే పూర్తి చేయలేదని అన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నెల్లికల్లు ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని మంత్రి జగదీశ్ రెడ్డిని రేవంత్ ప్రశ్నిచారు. భూకబ్జాలు చేసే ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఇసుక దందా చేసే మంత్రి జగదీశ్వర్ రెడ్డితో జిల్లా అప్రతిష్ఠపాలైందని వాపోయారు.
కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కైన జానారెడ్డి ఓటమితో అసెంబ్లీ చిన్నబోయిందని రేవంత్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నిస్తామని, రైతులకు అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చారు. ఓరుగల్లు సభతో కాంగ్రెస్ రాష్ట్రంలో రైతులకు అండగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. రైతులను ఆదుకోవాల్సిన సర్కారు మద్దతు ధర ఇవ్వకపోవడంతో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజకీయ భవిష్యత్ తప్ప రైతు బాధలు పట్టవని రేవంత్ రెడ్డి విమర్శించారు. వరంగల్ సభకు ప్రతి కార్యకర్త తొమ్మిది మంది చొప్పున కార్యకర్తలను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.