- కోటి మంది వ్యవసాయ కూలీలుంటే.. పది లక్షల మందికే ఇస్తరా?: హరీశ్ రావు
సంగారెడ్డి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం 90 లక్షల మంది వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎగ్గొట్టే కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. స్టేట్లో కోటి మంది వ్యవసాయ కూలీలు ఉంటే.. కేవలం పది లక్షల మందికే ఇస్తామనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రకరకాల కారణాలతో రైతులకు కోతలు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నదన్నారు. ఇది ముమ్మాటికి రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు.
సోమవారం సంగారెడ్డిలో హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. మీరు ఇచ్చిన రుణమాఫీ చెక్కు ఈరోజు వరకు ఎందుకు రైతుల ఎకౌంట్లో డబ్బులు పడలేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో డమ్మీ హామీలు ఇచ్చినట్టు.. సీఎం రుణమాఫీ డమ్మీ చెక్కులు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి రైతులకు అరిచేతిలో వైకుంఠం చూపించి.. ఎన్నికల తర్వాత మొండి చేయి చూపిస్తున్నారని విమర్శించారు. అలాగే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై చర్చకు సిద్ధమని హరీశ్ రావు సవాల్ విసిరారు. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కాలేదు.. ఒక్క ఎకరాకూ నీళ్లు ఇవ్వలేదు’’ అని నాగర్ కర్నూల్ సభలో డిప్యూటీ సీఎం అబద్ధాలు మాట్లాడినట్టు చెప్పారు. వాటిపై బహిరంగ చర్చకు సిద్ధమని, తన దగ్గర ఉన్న లెక్కలతో సహా వస్తానని తెలిపారు.