- మందు పోయకుండా పోటీ చేసే దమ్ముందా?: రేవంత్‌రెడ్డి
- దీపావళి నాడు గుట్టకు వచ్చి ప్రమాణం చేస్తరా?
- గాడిదలకు గడ్డి వేసి బర్రెలకు పాలు పిండితే వస్తయా?
- వేరేటోళ్లకు ఓట్లేసి కాంగ్రెస్‌ను కొట్లాడమంటే ఎట్లా ?
- ఆడోళ్లందరూ స్రవంతికి ఓట్లేస్తే 30 వేల మెజార్టీతో గెలుస్తది
చౌటుప్పల్, వెలుగు: ‘రాష్ట్రాన్ని బంగారం చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ తాగుబోతుల తెలంగాణగా మార్చిండు. తెలంగాణ రాక ముందు మద్యంపై రూ. 10 కోట్ల ఆదాయం వస్తే టీఆర్‌ఎస్ గెలిచిన తర్వాత ఎనిమిదేండ్లలో రూ. 40 వేల కోట్లకు పెంచిన్రు. 1,200 మంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకుంది ఇందుకేనా ?’ అని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మునుగోడు ఎన్నికల్లో మద్యం పంచకుండా గెలిచే దమ్ము టీఆర్‌ఎస్, బీజేపీలకు ఉందా అని సవాల్ విసిరారు. ఓటర్లకు మద్యం పోయబోమని దీపావళి నాడు యాదగిరిగుట్టకు వచ్చి ప్రమాణం చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్, తంగడపల్లి, దండుమల్కాపురంలో మంగళవారం రేవంత్ రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మునుగోడు ప్రజలకు ఇన్నాళ్లూ డబుల్ ఇండ్లు ఇచ్చారా ? రైతులకు లోన్లు ఇచ్చారా ? అని కూడా పట్టించుకోని అధికార పార్టీ లీడర్లు ఎన్నికలు ఉన్నాయి కాబట్టే మునుగోడు చుట్టూ తిరుగుతున్నారన్నారు. 2014లో ఒక్క ఆడబిడ్డకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ఒక ఆడ బిడ్డకు టికెట్ ఇస్తే ఆమెను ఓడించేందుకు ఢిల్లీ నుంచి అమిత్‌షా, గజ్వేల్ నుంచి కేసీఆర్ వచ్చారన్నారు.
తెలంగాణను తాగుబోతుల అడ్డాగా మార్చిన సీఎం కేసీఆర్‌ను మహిళలు చెప్పుతో కొట్టాలన్నారు. చౌటుప్పల్‌కు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, మినీ ట్యాంక్‌బండ్, రాచకొండ గిరిజనులకు పట్టాలు, చర్లగూడెం నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా మోసం చేశారన్నారు. గాడిదల గడ్డి వేసి బర్రెలకు పాలు పిండితే రావని, అలాగే బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు ఓటు వేసి కాంగ్రెస్‌ను కొట్లాడమంటే సాధ్యం కాదన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో లక్ష మందితో బహిరంగ చర్చ పెట్టి మీరేం చేస్తారో.. మేమేం చేస్తామో ప్రజలకు చెబుదామన్నారు. నియోజకవర్గంలో మహిళల ఓట్లే 1.20 లక్షలు ఉన్నాయని, వాళ్లంతా స్రవంతికి ఓటు వేస్తే 30 వేల మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, చలమల కృష్ణారెడ్డి, పున్న కైలాశ్ నేత పాల్గొన్నారు.