కడుపునకు అన్నం తినేవారు రాహుల్ అర్హతను ప్రశ్నించరు.. రేవంత్లో కట్టలు తెంచుకున్న ఆవేశం

తెలంగాణలో బీఆర్ఎస్కు..కేంద్రంలో బీజేపీకి బైబై అన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ జాతీయ  పార్టీ విధానం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆరెస్ అంటేనే బీజేపీ రిస్తాజార్ సమితి అని రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు. బీఆరెస్ను ఎట్టిపరిస్థితుల్లో కలుపుకోమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారన్నారు. కాంగ్రెస్ విధానం ఏంటో ఖమ్మం సభ ద్వారా చెప్పామని..బీఆర్ఎస్ విధానమేంటో చెప్పాలన్నారు. 

బీఆర్ఎస్ను రానివ్వం..

బెంగుళూరులో జరిగే ప్రతిపక్షాల సమావేశానికి బీఆర్ఎస్ను రానివ్వమని రేవంత్ రెడ్డి తెలిపారు. ఒకవేళ సిగ్గులేకుండా వచ్చినా.. బీఆర్ఎస్ను  మెడలు పట్టి గెంటేస్తామన్నారు. బీఆర్ఎస్ నేతలపై ఈడీ దాడులు జరగకుండా ఉండేందుకే కేటీఆర్ కేంద్ర పెద్దలను కలిశారని ఆరోపించారు. కాంగ్రెస్ ను విమర్శించే నైతిక హక్కు  బీఆర్ఎస్కు లేదన్నారు. ఏపీలో పోటీ చేస్తామంటున్న బీఆర్ఎస్.. తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెబుతుందన్నారు.  భట్టి చదువుకున్న ప్రజాప్రతినిధి అన్నారు.  ఆయన్ను  దళితుడని చిన్నచూపు చూసే బీఆర్ఎస్  నేతల మూతిపై కొట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుడే సీఎం అని, వర్గీకరణకు సహకరించకుండా దళితులను అవమానించింది  బీఆర్ఎస్సె అని విమర్శించారు. 

రూ. 4 వేల పింఛన్ ఇస్తాం..

అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించినా రూ.4000 పెన్షన్ హామీకి కాంగ్రెస్  కట్టుబడి ఉందన్నారు. కేసీఆర్ అవినీతిని ఆపితే చాలు తెలంగాణలో మొత్తం 55 లక్షల మంది పెన్షన్ దారులకు పెన్షన్ ఇవ్వొచ్చని చెప్పారు. తెలంగాణ ఇచినట్లే.. రూ.4000 పెన్షన్ ఇచ్చి తీరతామని స్పష్టం చేశారు. కేసీఆర్ కు చిత్తం శివుడి మీద,  భక్తి చెప్పులపై ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర జనాభా అవసరాలు, పరిస్థితులను బట్టే పథకాలు ఉంటాయని...రాష్ట్ర ఆదాయం ఆధారంగానే ప్రాధాన్యతలు ఉంటాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్  ప్రాధాన్యత రూ.4000 పెన్షన్ ఇవ్వడమన్నారు. 

మీకున్న అర్హత ఏంటి...

ఏ హోదాలో రాహుల్ ఇక్కడికి వచ్చారని ప్రశ్నిస్తున్నారన్న వారికి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీది కేసీఆర్ కుటుంబంలా దోపిడీ కుటుంబం కాదన్నారు.  తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కుమారుడు రాహుల్ గాంధీ అని... దేశం కోసం సర్వం త్యాగం చేయడానికి భారత్ జోడో యాత్రతో ప్రజల్లోకి వచ్చిన నాయకుడు రాహుల్ గాంధీ అని చెప్పారు.  దేశంలో రాహుల్ గాంధీకి కాకుండా ఇంకెవరికి తెలంగాణలో పర్యటించే అర్హత  ఉందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అంటగాకుతున్న నరేంద్ర మోదీకి  అర్హత ఉందా? ... అసలు బీఆర్ఎస్ నేతలకు ఉన్న  అర్హత ఏంటి? అని నిలదీశారు. ట్విట్టర్ పిట్ట, మంత్రులు.. రాహుల్ గాంధీ అర్హతపై ప్రశ్నిస్తున్నారని...భూమికి మూడు అడుగులున్నోడు కూడా రాహుల్ గాంధీ అర్హత గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కడుపుకు అన్నం తినేవారు ఎవరూ రాహుల్ అర్హత గురించి ప్రశ్నించరని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాహుల్ ను విమర్శించడమంటే హరీష్, కేటీఆర్ ఒకరిపై ఒకరు కాండ్రించి ఉమ్మేసుకున్నట్లే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు దోపిడీ దొంగలు, బందిపోటు దొంగలకంటే హీనం అన్నారు. జులై 2వ తేదీ  ఖమ్మం సభ చూసైనా బుద్ది తెచ్చుకోవాలని హితవు పలికారు. 

ALSO READ:నిమ్స్ లో రోబో సేవలు... దేశంలోనే పెద్ద డయోగ్నస్టిక్ సెంటర్

కాంగ్రెస్ ఇచ్చినవి..తెచ్చినవి ఎన్నో ...

తెలంగాణలో ఎన్నో పథకాలు, ఎన్నో చట్టాలు, ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. లక్షా 7 గ్రామాలకు విద్యుత్ అందించింది కాంగ్రెస్. పేదలందరికి విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్. పబ్లిక్ సెక్టార్స్ తీసుకొచ్చి కోట్లాది మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించింది కాంగ్రెస్. హైదరాబాద్ కు  ఆదాయం తెచ్చే ఔటర్, ఐటీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఫామ్ హౌస్ లు , పేపర్, టీవీలు పెట్టుకోవడం తప్ప ఏం తెచ్చారని ప్రశ్నించారు?. రూ. 38 వేల కోట్లతో కాంగ్రెస్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మొదలు పెడితే... ప్రాజెక్టు పేరు, డిజైన్ మార్చి బడ్జెట్ ను రూ. లక్షా 49, 131కోట్లకు కేసీఆర్ పెంచారని మండిపడ్డారు. మూడో టీఎంసీ కోసం రూ. 25వేల 831కోట్లు బడ్జెట్ కేటాయించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు 85వేల కోట్లు బిల్లులు చెల్లించింది నిజం కాదా అన్నారు. . ఏటా రూ. 25 వేల కోట్లు ఖర్చు చేయాల్సి పరిస్థితి నిజం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ వనరులను మింగే తెల్ల ఏనుగు కాళేశ్వరం ప్రాజెక్టు అని దుయ్యబట్టారు. చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై  కాగ్ నివేదికపై హరీష్, కేటీఆర్ చర్చకు రావాలని సవాల్ విసిరారు.  ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు 64 వేల ఎకరాలే సేకరించారని..మరో 20 వేల ఏకరాలకుపైగా సేకరించాల్సి ఉందన్నారు. 

రాహుల్ గాంధీ సభను విఫలం చేసేందుకు బీఆరెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీఆరెస్ తో పాటు కొంతమంది మున్సిపల్, ట్రాన్స్పోర్ట్, పోలీసు అధికారులు ఇలా చేయడం దారుణమన్నారు. జనగర్జనకు రాకుండా ప్రభుత్వం అన్ని రకాల కుయుక్తులు చేసిందన్నారు. అధికారులు, బీఆరెస్ ప్రజాప్రతినిధులు, అక్కడి సైకో మంత్రి సభకు రాకుండా జనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని...అసలు నక్క తప్ప వేట కుక్కలన్నీ బయటకు వచ్చి మొరగడం మొదలు పెట్టాయన్నారు.