డిసెంబర్ 9న అధికారంలోకి కాంగ్రెస్..ఖమ్మంలోనే విజయోత్సవ సభ

డిసెంబర్ 9న రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చాక ఖమ్మంలోనే విజయోత్సవ సభ నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం కొల్లగొట్టిందని మండిపడ్డారు. తెలంగాణ పొలిమేరల నుంచి కేసీఆర్ కుటుంబాన్ని అండమాన్ వరకు తరమాలని పిలుపునిచ్చారు. ఖమ్మం సభకు బీఆర్ఎస్ ప్రభుత్వం బస్సులు ఇవ్వలేదని విమర్శించారు. అయినా కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ప్రభుత్వ గోడలను కూలగొట్టుకుంటూ ఖమ్మం సభకు తరలివచ్చారని చెప్పారు. 

వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ ప్రకటించామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సరూర్ నగర్ సభలో యూత్ డిక్లరేషన్ వివరించామన్నారు. ఖమ్మం జనగర్జన సభలో వృద్ధులకు రూ. 4వేల పింఛన్ ఇవ్వబోతున్నట్లు రాహుల్ గాంధీ ప్రకటించారని చెప్పారు.  తెలంగాణ ఉద్యమానికి పునాది ఖమ్మం జిల్లాలో పడిందని గుర్తు చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో బందీ అయిన తెలంగాణకు విముక్తి కల్పించేందుకు మళ్లీ ఖమ్మం నుంచి నాంది పలకాలని సూచించారు. 

ఖమ్మం జిల్లాలో సీనియర్ లీడర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన చేరిక ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 10 సీట్లలో విజయం సాధించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే 109 రోజుల పాటు భట్టి విక్రమార్క పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారని తెలిపారు. అందరి అభిప్రాయాలు తీసుకుని..ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా  కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంటుందన్నారు.