- చంద్రబాబు లెటర్‌కు రిప్లై ఇస్తూ రేవంత్ రెడ్డి లేఖ
హైదరాబాద్, వెలుగు: విభజన సమస్యల పరిష్కారం కోసం భేటీ అవుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. చర్చల ప్రతిపాదనను ఆహ్వానిస్తూ ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ నెల 6న హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా చర్చిద్దామని ఆహ్వానించారు. ‘‘మీ లేఖను చదివా.. మీ లేఖలో నా గురించి ప్రస్తావించిన విషయాల పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసినందుకు మీకు అభినందనలు.
స్వతంత్ర భారతంలో నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి అరుదైన ఘనతను సాధించారు. ఈ టర్మ్‌లోనూ సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తున్నా. ముఖాముఖి భేటీ అవుదామన్న మీ ప్రతిపాదనతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. విభజన సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నా. పరస్పర సహకారం, ఆలోచనల బదిలీ ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేందుకు దోహద పడుతుందని ఆశిస్తున్నా. ప్రజల అభ్యున్నతికి దోహదపడేలా.. ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు ఈ సమావేశం కీలకం. తెలంగాణ ప్రజల తరఫున మిమ్మల్ని ఈ నెల 6న మధ్యాహ్నం ప్రజా భవన్‌లో జరిగే సమావేశానికి సాదరంగా ఆహ్వానిస్తున్నా’’ అని రేవంత్‌రెడ్డి చంద్రబాబుకు లేఖ రాశారు.