- లగచర్లలో ఫార్మా సిటీకి జులైలో గెజిట్ ఇచ్చి, ఇప్పుడెలా కాదంటరు?: హరీశ్‌రావు
- మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పారు
- కూలిపోయిందన్న కాళేశ్వరమే కాంగ్రెస్ కు దీపమైందని వెల్లడి
హుజూరాబాద్, వెలుగు: అబద్ధాలు ఆడడంలో సీఎం రేవంత్ రెడ్డి పీహెచ్‌డీ చేశారని, ఆ విషయంలో ఆయనకు డాక్టరేట్ ఇవ్వొచ్చని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. రేవంత్ నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడడం లేదని వ్యాఖ్యానించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి.. ఇప్పటివరకూ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా పూర్తి చేయలేదని ఆరోపించారు.
మహారాష్ట్రలో అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన విషయాన్ని మహారాష్ట్ర ప్రజలు గమనించారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిందని, ఎక్కడ చూసినా అరాచకమే నడుస్తున్నదని అన్నారు. సీఎం ఇలాకాలోనే ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నారని తెలిపారు.
2024 జులై19న ఫార్మా సిటీ కి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన సీఎం.. ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు అని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఫార్మాసిటీ ఏర్పాటు చేసే ప్రాంతం తొండలు గుడ్లు పెట్టని ప్రదేశమని సీఎం అంటున్నారని, ఇది పచ్చి అబద్ధమని, రైతులు స్వయంగా అక్కడ పచ్చని పొలాలు చూపిస్తున్నారని తెలిపారు. ఫార్మాసిటీని రద్దుచేసి రైతులను ఆదుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కూలిపోయిందని చెప్పిన కాళేశ్వరమే కాంగ్రెస్ పార్టీకి కి దీపం అయిందని అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరంతో తెలంగాణ వ్యాప్తంగా భూములు సస్యశ్యామలం అయ్యాయని తెలిపారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో గోబెల్స్ ప్రచారం చేశారు. ఇప్పుడేమో కాళేశ్వరం నుంచి 20 టీఎంసీల మంచినీటిని హైదరాబాద్‌కు తీసుకెళ్తామని చెప్పి టెండరక్లు పిలవాలని సీఎం అంటున్నారు. కాళేశ్వరం కూలిపోతే.. మరి 20 టీఎంసీలు ఎలా తీసుకెళ్తామంటున్నారు?’’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
దళిత బంధు నిధులపై ఫ్రీజింగ్ ఎత్తేయాలి
హుజూరాబాద్ నియోజకవర్గం లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన దళిత బంధు పథకం ద్వారా ఎంతోమంది దళితులు ఉన్నత స్థాయికి ఎదిగారని హరీశ్‌రావు తెలిపారు. రెండో విడత దళిత బంధుపై ఫ్రీజింగ్ ఎత్తివేసి, లబ్ధిదారుల అకౌంట్లో వెంటనే డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు.
దళిత బంధు కోసం హుజూరాబాద్ లో ధర్నాకు దిగిన దళిత కుటుంబాలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. అరెస్టులను ఆపేసి, దళిత బంధు అమలు చేయాలని కోరారు. ఆయన వెంట ఎమ్మెల్యే లు పాడి కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, తదితరులున్నారు.