హనుమకొండ : కరెంట్ కోతలు, ఛార్జీల పెంపుతో రైతులు, జనాన్ని ఇబ్బందిపెడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. విద్యుత్ విషయంలో గొప్పలు చెప్పుకుంటున్న సర్కారు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉందని రేవంత్ విమర్శించారు. త్రీ ఫేజ్ కరెంటును ఇష్టానుసారం కాకుండా ప్రణాళికాబద్ధంగా సరఫరా చేయాలని సూచించారు. వ్యవసాయానికి గంట పాటు కరెంటు ఇచ్చి మరో గంట కట్ చేయడం, రాత్రి పూట విద్యుత్ సరఫరా చేయడం వల్ల రైతులకు ఉపయోగం లేకుండా పోతుందని అన్నారు.
ఏసీడీ ఛార్జీల బాదుడుతో జనాలు ఇప్పటికే తీవ్ర ఇబ్బంది పడుతుండగా.. ఏప్రిల్ 1 నుంచి ఎఫ్ సీఏ ఛార్జీలు మోపేందుకు సిద్ధమవుతోందని మండిపడ్డారు. ఇలా ఇష్టారాజ్యంగా పేదలపై భారం మోపడం సరికాదని హితవు పలికారు. ఐనవోలు మల్లిఖార్జున స్వామి దర్శనం అనంతరం రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. మార్గమధ్యలో ఐనవోలు సబ్ స్టేషన్ ను సందర్శించారు. కరెంట్ ఛార్జీలు, విద్యుత్ సమస్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.