పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తాం : రేవంత్​ రెడ్డి

  • కామారెడ్డిలో కేసీఆర్​ను ఓడించి చారిత్రాత్మక  తీర్పునివ్వాలి

కామారెడ్డి, భిక్కనూరు, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే పేదల  సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని టీపీసీసీ చీఫ్​రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. తాను పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో శనివారం రేవంత్​రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజంపేట, భిక్కనూరు మండల కేంద్రాల్లో నిర్వహించిన కార్నర్​ మీటింగ్స్​లో ఆయన పాల్గొన్నారు.  పేదల ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్​ ఇస్తామని, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు.

అన్నదాతలకు రూ.3 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. సౌభాగ్య లక్ష్మీ పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 అందిస్తామన్నారు. దేశం మొత్తం కామారెడ్డి వైపు చూస్తుందని, ఈ ఎన్నికల్లో కేసీఆర్​ను ఓడించి కామారెడ్డి ప్రజలు చారిత్రాత్మక తీర్పునివ్వాలన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో  తరలిరావడం, ప్రోగ్రామ్స్​ సక్సెస్​ కావడంతో కాంగ్రెస్​ శ్రేణుల్లో జోష్​ పెరిగింది. ప్రతిపక్ష బీఆర్ఎస్​పై విమర్శలు చేస్తూనే, కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాలను రేవంత్​  ప్రజలకు వివరించారు.  

మాజీ మంత్రి షబ్బీర్​అలీ మాట్లాడుతూ..  కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. రేవంత్ ​రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే యూసుఫ్​అలీ, మహిళా కాంగ్రెస్​ మాజీ స్టేట్ ​ప్రెసిడెంట్ శారద, డీసీసీ ప్రెసిడెంట్ ​కైలాస్ ​శ్రీనివాస్​రావు, లీడర్లు చంద్రకాంత్​రెడ్డి, ఇంద్రకరణ్​రెడ్డి, భీమ్​రెడ్డి, గూడెం శ్రీనివాస్​రెడ్డి, ఆనంద్​రావు, యాదవ్​రెడ్డి, వీరన్న పాల్గొన్నారు. 

హెలిక్యాఫ్టర్​లో రావాల్సి ఉండగా..

రేవంత్​రెడ్డి హైదరాబాద్​ నుంచి కామారెడ్డికి హెలిక్యాప్టర్​లో రావాల్సి ఉండగా, రోడ్డు మార్గంలో వచ్చారు. దీంతో కార్నర్​ మీటింగ్స్​​ నిర్వహణకు ఆలస్యమైంది. అందుకే కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డిలో కార్నర్​ మీటింగ్​కు రేవంత్​ హాజరు కాలేదు.