- నియోజక వర్గంలో రోడ్ షోలు, జిల్లా కేంద్రంలో ర్యాలీ
- భారీగా తరలివచ్చిన జనం
కామారెడ్డి/ కామారెడ్డిటౌన్, వెలుగు : ఎన్నికల ప్రచారానికి మంగళవారం ఆఖరి రోజు కావడంతో కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి, పీసీసీ ప్రెసిడెంట్ హోరెత్తించారు. నియోజకవర్గాల్లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఆయా సందర్భాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘రాష్ర్ట నలుమూలాల తిరిగే బాధ్యత పార్టీ తనపై పెట్టడంతో నియోజకవర్గానికి ఎక్కువ సార్లు రాలేకపోయానన్నారు. త్వరలోనే తప్పకుండా అన్ని గ్రామాలు తిరుగుతానని చెప్పారు. ఈ ఎన్నికల్లో కామారెడ్డి ప్రజలు గొప్ప తీర్పు ఇవ్వాలన్నారు. 40 ఏళ్ల కేసీఆర్ రాజకీయాల్లో అమ్మమ్మ ఊరు, అమ్మ ఊరు గుర్తుకు రాలేదా..? అని ప్రశ్నించారు.
కేసీఆర్‌కు ఇయ్యాల కోనాపూర్ గుర్తుకు వచ్చిందా అని విమర్శించారు. కామారెడ్డి రైతులు, బీడీ కార్మికులు, గల్ఫ్ కార్మికులు కష్టాల్లో ఉన్నప్నుడు ఇక్కడకు రాలేదన్నారు. కామారెడ్డి మార్కెట్‌ను విస్తరించాలనే అలోచన చేయలేదన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయటం మరచిపోవద్దన్నారు. బీఆర్ఎస్కు ఓటు వేసి తమకు కష్టాలు వచ్చాయని చెప్పారు. స్టేట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. రైతులు, కార్మికులు, బీడీ కార్మికులు, పేదల సమస్యలు తీర్చడానికి కాంగ్రెస్ పని చేస్తుందని అన్నారు.
కామారెడ్డిలో పరిశ్రమలు నెలకొల్పుతామన్నారు. హైదారబాద్ , నిజామాబాద్ హైవేలో పారిశ్రామిక కారిడర్ గుర్తించి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడి ప్రజల సమస్యలు తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు.ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు యూసుఫ్‌అలీ, అనిల్, డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్‌రావు, లీడర్లు పండ్ల రాజు, శ్రీనివాస్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, శ్రీను, ఆశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో ర్యాలీ
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించింది. వీక్లి మార్కెట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ, జేపీఎన్ చౌరస్తా , సుభాష్‌రోడ్డు, స్టేషన్ రోడ్డు, రైల్వే కమాన్, నిజాంసాగర్ ఛౌరస్తా వరకు సాగింది. ఇక్కడ ప్రజలను ఉద్ధేశించి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. బీబీపేట, దోమకొండల్లో కూడా ర్యాలీలు నిర్వహించారు.