కామారెడ్డి పేరు ఇప్పుడు దేశం మొత్తం మారుమోగుతోందన్నారు టీపీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి. ఇక్కడి ప్రజలు ధర్మం వైపు నిలబడతారా..? అధర్మం వైపు నిలబడతారా..? అని కామారెడ్డి తీర్పుపై యావత్ దేశం నిశితంగా గమనిస్తోందన్నారు. ధర్మాన్ని కాపాడేందుకే తాను కామారెడ్డి ప్రజల వద్దకు వచ్చానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇన్నేళ్ల తర్వాత కొనాపూర్, కామారెడ్డి గుర్తొచ్చాయా..? అని ప్రశ్నించారు. కామారెడ్డిలోని చుక్కాపూర్ లో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
ఏ ఒక్కరికి కూడా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చాడా.. ? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాడా? అని ప్రశ్నించారు రేవంత్. ఇన్నేళ్లలో కామారెడ్డికి ఏమీ చేయని కేసీఆర్... ఇక్కడి ఓట్ల కోసం కామారెడ్డి ప్రజల వద్దకు వస్తున్నారని అన్నారు. గ్రామాలను ఆక్రమించుకునేందుకు కాలకేయ ముఠా కామారెడ్డికి వచ్చిందని ఆరోపించారు. ప్రజల భూములను కాపాడేందుకే తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. కాంగ్రెస్ గెలిస్తేనే పేదోళ్లకు న్యాయం జరుగుతుందన్నారు.