
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బోథ్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని.. అలాగే బోధ్ ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆదిలాబాద్ ను దత్తత తీసుకొని అత్యధికంగా అభివృద్ధి చేస్తానని అన్నారు. బోథ్ నియోజకవర్గంలో ఒక్కసారి కాంగ్రెస్‌కు ఓటు వేయండని ప్రజలను కోరారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో కాంగ్రెస్ ప్రజా విజయభేరి సభలో సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్ వల్ల బోథ్‌కు నీళ్లు రాలేదని అన్నారు. కేసీఆర్ ను గద్దె దించడానికి కోదండరాం, సీపీఐ నేతలు కలిశారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ వెనుకబడిన జిల్లా అని తెలిపారు. పదేళ్లలో ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల రాత మారలేదన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శించారు.
తెలంగాణ నేతల పాలనలో రాష్ట్రం ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నించారు. ఎన్ని తండాల్లో గ్రామ పంచాయతీ భవనాలు కట్టారని నిలదీశారు. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయలేదని అడిగారు. నిధులు అడిగితే ఎర్రబెల్లి ఖాళీ బీరు సీసాలు అమ్ముకొమ్మన్నారని రేవంత్ రెడ్డి చెప్పారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలని రేవంత్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక కూటమి అని తెలిపారు. దొరల పాలన అంతం కావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు.