మునుగోడు ఉప ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. సిట్టింగ్ సీటును దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో జరిగిన సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, మునుగోడు ఎన్నికలపై చర్చించామని రేవంత్ రెడ్డి చెప్పారు. పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాలపై కూడా చర్చించామన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపై చర్చించామన్నారు. కాంగ్రెస్ లో అందరూ క్రమశిక్షణతో మెలగాలని అధిష్టానం సూచించిందని తెలిపారు.
త్వరలోనే మునుగోడు ఉప ఎన్నికల అభ్యర్థిని ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. జిల్లా నాయకత్వంతో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తామన్నారు. వివిధ జిల్లాలలో ఖాళీగా ఉన్న పార్టీ పదవులపై ప్రియాంక గాంధీతో చర్చించామన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సమయం లేకపోవడం వల్ల మీటింగ్ కి రాలేదన్నారు. వెంకట్ రెడ్డిని కలుపుకొని ముందుకు వెళ్లాలని సమావేశంలో అధిష్టానం సూచించిందన్నారు. ఆయన అభిప్రాయాన్ని తీసుకొని అభ్యర్థిని ఖరారు చేస్తామని తెలిపారు. అందరం కలిసికట్టుగా మునుగోడులో పని చేస్తామన్నారు.