కేసీఆర్.. నువ్వు చర్లపల్లి జైలుకే : రేవంత్ రెడ్డి

కరీంనగర్, సిద్దిపేట/దుబ్బాక/ ముషీరాబాద్/ఎల్బీనగర్, వెలుగు: డబుల్ బెడ్రూం ఇండ్ల ఆశ చూపి సీఎం కేసీఆర్ పేదలను మోసం చేశారని పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘వచ్చే నెలలో రిటైరయ్యే కేసీఆర్ ను చర్లపల్లి జైలుకు పంపించి.. అందులో డబుల్ బెడ్రూం కేటాయించి.. మింగిన లక్ష కోట్ల డబ్బుల్ని కేసీఆర్​తో కక్కిస్తం”అని ఆయన అన్నారు. ఇండ్లులేని పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించకుండా ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల్లో ఫామ్​ హౌజ్,  పది ఎకరాల్లో 150 గదుల ఇల్లును కేసీఆర్ నిర్మించుకున్నారని ఆయన ఫైర్​ అయ్యారు.‘‘ బక్కోడినని చెప్పుకుంటూ.. బకాసురిడిలా మారిన కేసీఆర్..  తనపైకి గుంపులుగా వస్తున్నారని ఏడుస్తున్నాడు. కేసీఆర్ కుంబకర్ణుడిలాంటివాడు.. లేస్తే మింగుతడు.. మింగితే పంటడు” అని దుయ్యబట్టారు.  గురువారం సిద్దిపేట జిల్లా దుబ్బాక, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని  జమ్మికుంట, మానకొండూరు నియోజకవర్గంలోని రేణికుంట, ముషీరాబాద్, వనస్తలిపురంలో జరిగిన సభలు, రోడ్​షోలలో రేవంత్​ మాట్లాడారు.

ఇవి ఆషామాషీ ఎన్నికలు కాదని, దేశంలో ప్రజాస్వామ్యం ఉండాల్నా? రాజరికం రావాల్నా? అని నిర్ణయించబోతున్నాయని అన్నారు.  తెలంగాణలో  దొరల రాజ్యం పోయి ప్రజల రాజ్యం రావాలంటే  కాంగ్రెస్ పార్టీ రావాలన్నారు. పదేండ్లలో కేసీఆర్ లక్షకోట్లు దోచుకున్నారని, నగరం చుట్టు 10 వేల ఎకరాలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. కేసీఆర్​ సిద్దిపేట, కరీంనగర్, పాలమూరులో గెలిచినా అక్కడ ప్రజలను పట్టించుకోలేదని, ఆ తర్వాత గజ్వేల్ కు వచ్చిండని,  పదేండ్లలో ఆయన బండారం బయటపడగానే  కామారెడ్డికి పారిపోయారని విమర్శించారు.  కామారెడ్డిలో కేసీఆర్ ను బొంద పెట్టుడేనన్నారు. ‘‘మీకు పెన్షన్ వస్తుందా అని ఓట్లు అడుగుతున్న సన్నాసులను అడగండి. మా మనవళ్లకు ఉద్యోగం వచ్చిందా అని. వాళ్లు ఎందుకు పదేండ్ల నుంచి అశోక్ నగర్ చౌరస్తాలో, అమీర్ పేట చౌరస్తాలో నిరుద్యోగులుగా తిరుగుతున్నారని ప్రశ్నించండి ' అని  రేవంత్​ సూచించారు.

తెలంగాణలో ప్రాజెక్టులను కట్టింది కాంగ్రెస్సే

తెలంగాణలో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సేనని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ చింతమడకలో చదువుకున్న బడిని, తాగే నీళ్లు వచ్చే ట్యాంక్ కట్టింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. దుబ్బాక అభివృద్ధికి అడ్డుపడటం మామా అల్లుళ్ల కు అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. దుబ్బాకకు మంజూరైన నిధుల్ని హరీశ్​ రావు సిద్దిపేటకు మళ్లించుకుని తీసుపోయారన్నారు. రెండు సార్లు  ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్​ రెడ్డి పేరులో కొత్త ఉన్నా.. ఆయన పాత చింతకాయ పచ్చడేనని విమర్శించారు.  ‘‘మూడేండ్ల కాలంలో దుబ్బాక అభివృద్ధికి పనిచేయని రఘునందన్ రావుకు ఓటు అడిగే హక్కు లేదు” అని అన్నారు. నీతి నిజాయతీలకు మారుపేరైన ముత్యంరెడ్డి కుటుంబానికి చెందిన శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరారు.

మూడు అడుగులున్న మానకొండూరు  ఎమ్మెల్యే  ఆరడుగులు దుంకుతడని,  నమ్మి గెలిపిస్తే ఈ ప్రాంతానికి  కాలేజీ తేలే,  రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించలేదు కానీ.. దొరలాగా తానూ ఫామ్ హౌస్ కట్టుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ పదవి,  కమీషన్ల కోసం కౌశిక్ రెడ్డి పార్టీ ఫిరాయించాడని, ఆయనకు   కొత్త ఉద్యోగం ఇవ్వాల్సిన పని లేదన్నారు. ఈసారి ప్రణవ్ కు   అవకాశం ఇవ్వాలన్నారు.   

కేసీఆర్ ను ఓడిస్తే 4 వేల పెన్షన్..  

రాష్ట్రంలో కేసీఆర్  ఉంటే పెన్షన్ 2వేలు వస్తుందని.. కేసీఆర్ ను ఓడిస్తే 4 వేల పెన్షన్ తో పాటు 6 గ్యారంటీలు ప్రజలకు వస్తాయని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేసే బాధ్యత మాది అని.. వీటి పైన 9 న సంతకం పెట్టే దాంట్లో అంజన్ కుమార్ యాదవ్ కీలకంగా ఉంటారని తెలిపారు. అంజన్ కుమార్ యాదవ్ ఎంపీగా ఉన్న సమయంలోనే ముషీరాబాద్ అభివృద్ధి జరిగిందని  అన్నారు. అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు.  

కార్యకర్తలను మోసం చేసిన సుధీర్ రెడ్డిని మూసీలో ముంచాలి

ఎల్ బీనగర్ లో నమ్మిన కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేసి.. మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ పదవి పొందిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఈ ఎన్నికల్లో మూసీలో తొక్కాలని రేవంత్ రెడ్డి అన్నారు. అభివృద్ధి ముసుగులో అమ్ముడు పోయిండని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనివ్వొద్దన్నారు. మధుయాష్కీ నాకు సోదరుడితో సమానమని, ఆయనను ఎల్బీనగర్ లో 30 వేల మెజారిటీతో గెలిపించాలని కోరారు.