మునుగోడు, వెలుగు : ‘మునుగోడు ఆడబిడ్డ స్రవంతిని సంపుకుంటారో, సాదుకుంటారో మీ ఇష్టం. ఆడబిడ్డ కంటతడి పెడితే రాజ్యానికి మంచిది కాదు’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మునుగోడులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆడబిడ్డల ఆత్మగౌరవ సభలో ఆయన మాట్లాడారు. స్రవంతిని గెలిపిస్తే వచ్చే ఎన్నికల్లో 15 మంది మహిళలకు ఎమ్మెల్యే టికెట్లతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నలుగురు మహిళలకు మంత్రి పదవులు ఇస్తామన్నారు. ఆ నలుగురిలో స్రవంతి కూడా ఉంటుందన్నారు. స్రవంతిని గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుని, అభివృద్ధి చేసే బాధ్యత కూడా తాను తీసుకుంటానన్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే తమకు అభ్యంతరం లేదని, కానీ, కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని చంపాలని బొడ్డులో కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడన్నారు. రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే చత్తీస్ గఢ్ పోయి బొగ్గు తవ్వుకుంటడని, జనం వైపు కన్నెత్తి చూడడన్నారు. రూ.400 ఉన్న సిలిండర్ రూ.1100 ఎందుకయ్యిందని బీజేపీ నాయకులను ప్రశ్నించాలన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని 2014లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే చేసిందేమీ లేదన్నారు. అయినా సిగ్గు లేకుండా మరోసారి వచ్చి ఓట్లు అడుగుతున్నారన్నారు. తమిళనాడులోని కరూర్ ఎంపీ జ్యోతిమణి ఎన్నికల టైంలో చేతిలో చిల్లగవ్వలేకున్నా లోక్సభ డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన తంబిదురైని 4లక్షల 20 వేల ఓట్ల మెజార్టీతో ఓడించిందన్నారు. ఇక్కడ కూడా అలాంటి తీర్పే ఇవ్వాలన్నారు.
నాన్న ఆశయాలను నెరవేర్చేందుకే..
కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి మాట్లాడుతూ ఒక ఆడబిడ్డను అడుగడుగునా టీఆర్ఎస్, బీజేపీ ఇబ్బంది పెడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆఫీసుపై, ప్రచార రథంపై దాడి చేశారన్నారు. ‘నా తండ్రి సహకారంతో రాజకీయంగా ఎదిగిన వారు నన్ను మోసం చేసి ఇతర పార్టీలకు అమ్ముడుపోయారు. నాకు వ్యాపారాలు లేవు. కేవలం మా నాన్న ఆశయాలను నెరవేర్చేందుకే పోటీ చేస్తున్న’ అని అన్నారు. దయచేసి తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండని కోరారు. తమిళనాడు కరూర్ ఎంపీ జ్యోతిమణి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రులు శ్రీధర్ బాబు, గీతారెడ్డి, దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు.