‘భారత్ జోడో గర్జన’ను విజయవంతం చేయాలి : రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో ‘భారత్ జోడో యాత్ర’ అద్భుతంగా సాగిందని, అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వచ్చిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ విరామం లేకుండా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారని అన్నారు. ఈడీ, సీబీఐ దాడులు చేసినా, తన ప్రాణానికి ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినా రాహుల్ గాంధీ వెనకడుగు వేయలేదని చెప్పారు. ఎన్నికలు, ఓట్ల కోసం కాదని, దేశ విశాల ప్రయోజనాల కోసమే రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టారని తెలిపారు. రాహుల్ పాదయాత్ర రేపు తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి చేరుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పాదయాత్ర నిర్వహించినందుకు కృతజ్ఞతగా.. ఘనంగా వీడ్కోలు పలికేందుకు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మేనూరు గ్రామంలో ‘భారత్ జోడో గర్జన సభ’ను నిర్వహిస్తున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. 

ప్రజల కోసమే రాహుల్ పాదయాత్ర : రేవంత్ రెడ్డి 
ప్రస్తుత పరిస్థితుల్లో దేశం మనుగడ ప్రమాదంలో పడిందని, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ అవినీతిలో కూరుకుపోయిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారని, ఈ యాత్రకు పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు తెలుపుతూ ముందుకు కదలిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సభకు హాజరై.. విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

దేశ ప్రజల కోసం రాహుల్ ఏ త్యాగనికైనా సిద్ధంగా ఉన్నారు : రేవంత్ 
కులం, మతం, భాష, ప్రాంతం పేరుతో దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం దేశంలో జరుగుతుందని ఆరోపించారు. ప్రస్తుతం దేశ ప్రజలు అభద్రతా భావంలో ఉన్నారని అన్నారు. దేశం కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించని సమస్యలను ప్రజలు రాహుల్ దృష్టికి తీసుకువస్తున్నారని తెలిపారు. ‘భారత్ జోడో యాత్ర’ చరిత్ర పుటల్లో నిలిచిపోతుందన్నారు. ‘తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనడం నాకు దేవుడిచ్చిన వరం’ అని అన్నారు. దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు భరోసా కల్పించేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారం పోతుందని తెలిసి కూడా ఇచ్చిన మాట కోసం సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాఆణ రాష్ట్రం ఇచ్చారని రేవంత్ రెడ్డి చెప్పారు. 

ఉప ఎన్నిక కౌంటింగ్ పై రేవంత్ రెడ్డి స్పందన
మునుగోడు ఉప ఎన్నికపై పూర్తి ఫలితం వచ్చిన తర్వాతే తాను, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలందరూ స్పందిస్తారని రేవంత్ రెడ్డి చెప్పారు. 

పాదయాత్రకు మంచి స్పందన వచ్చింది : భట్టి విక్రమార్క
దేశ చరిత్రలో రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రంలో రాహుల్ పాదయాత్రకు విశేష స్పందన వచ్చిందన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే షూగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం : మధుయాష్కి
దేశ, రాష్ట్ర ప్రజలు రాహుల్ గాంధీని ప్రత్యామ్నాయ నాయకుడిగా చూస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి అన్నారు. విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రం బాగా వెనుకబడిందన్నారు. 
కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ మూతపడిందన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నేతృత్వంలో చెరుకు రైతులు రాహుల్ గాంధీని కలిసి, తమ సమస్యలను విన్నవించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు.