నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పోడు భూముల సమస్యలు ఇప్పటికీ తీరలేదన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గతంలో నిజామాబాద్ నుంచి ఐదేళ్లు ఎంపీగా ఉన్న ఎమ్మెల్సీ కవిత కూడా ఇక్కడి ప్రజల సమస్యలను ఏనాడు పట్టించుకోలేదన్నారు. పదేళ్లు అవుతున్నా ఇప్పటికీ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేదని చెప్పారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూపతి రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి వేలకోట్లకు పడగలెత్తాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కట్టుకున్నట్లే బాజిరెడ్డి కూడా ఫామ్ హౌజ్ లు కట్టుకున్నారని చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కరించకుండా బాజిరెడ్డి మాత్రం ఆస్తులు సంపాదించుకున్నాడని అన్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను తొలగించకపోవడం కారణంగా కేసీఆర్ కూతురు కవితను ఓడించారని చెప్పారు. అప్పటి నుంచి నిజామాబాద్ జిల్లాపై కేసీఆర్ కక్షగట్టి.. అభివృద్ధి చేయలేదన్నారు.
అనాడు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆర్టీసీ కార్మికుల హక్కులను బాజిరెడ్డి గోవర్ధన్ కాలరాశాడని ఆరోపించారు రేవంత్ రెడ్డి. డీజీల్ అమ్మకాలు, కొనుగోళ్లలో కమీషన్లకు కక్కుర్తి పడి 50 మంది ఆర్టీసీ కార్మికులను పొట్టన పెట్టుకున్నారని విమర్శించారు. ఏనాడు కూడా ఈ ప్రాంత రైతులు, ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం పని చేయలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి కూడా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80కి పైగా సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనపై దాడి చేయడానికి కాంగ్రెస్ వాళ్లు వస్తున్నారని కేసీఆర్ అంటున్నారని, మరి నిజంగా బక్కోడివి కదా.. లక్ష కోట్లు ఎలా మింగినవు..? అని ప్రశ్నించారు. 10వేల ఎకరాల భూములను ఎలా అక్రమించుకున్నావు..? అని అడిగారు.
ఆర్టీసీ కార్మికుల పొట్టనబెట్టుకున్న బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని 100 మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత నిజామాబాద్ జిల్లా ప్రజలపై ఉందన్నారు. ఎర్రజొన్న రైతుల మీద అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్యే యుద్ధం జరుగుతోందన్నారు. నిజామాబాద్ జిల్లా ఎవరివైపు ఉంటుందో.. రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించే సమయం వచ్చింది.. అందరూ ఆలోచించి.. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. తాము కాంగ్రెస్ హయంలో కట్టిన సాగునీటి ప్రాజెక్టులను చూపి ఓట్లు అడుగుతాం.. కాళేశ్వరం ప్రాజెక్టును చూపి ఓట్లు అడిగేందుకు కేసీఆర్ సిద్ధమా..? అని సవాల్ విసిరారు. ఇందిరమ్మ రాజ్యంలో కేసీఆర్ లాంటి వాళ్లను పొలిమేర్ల దాటే వరకూ తరిమికొడుతామన్నారు.