తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఫీజుల నియంత్రణలో సర్కార్ విఫలమైందన్నారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పిన ముఖ్యమంత్రి.. ప్రజలను మోసం చేశారని చెప్పారు. మళ్లీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని మరో మోసానికి తెరలేపారని రేవంత్ ధ్వజమెత్తారు. విద్యపై కేసీఆర్ కు నిజంగా ప్రేమ ఉంటే దాదాపు ఐదు వేల స్కూళ్లను ఎందుకు మూసివేశారో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వపాఠశాలల్లో టీచర్ పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదో తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ , బీసీలకు కేసీఆర్ చదువును దూరం చేశారని రేవంత్ ఆరోపించారు.
తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారు.. కానీ అక్కడ స్కూళ్లను ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. యూనివర్సిటీల్లో నియామకాలు లేకపోవడంతో నిధులు ఆగిపోయాయన్నారు. టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థ ఆగమైందన్నారు. పిల్లలకు చదువు చెప్పించకుండా గొర్రెలు, బర్లు ఇస్తామని చెబుతూ రాతీయుగం వైపు సమాజాన్ని తీసుకెళ్తున్నారని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లను తయారు చేయాల్సిన విద్యావ్యవస్థలు మూతబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరికీ యూనివర్సిటీలలో 15శాతం మాత్రమే టీచింగ్ ఫ్యాకల్టీ ఉందన్నారు. కేసీఆర్ కు ఉద్యోగాలు భర్తీ చేయడం ఇష్టం లేదన్నారు. అందుకే ఆయా శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. రాజకీయ నిరుద్యోగులకు, కుటుంబ సభ్యులకి ఉద్యోగాలు ఇవ్వడమే సరిపోయిందన్నారు. కరోనాను కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న రేవంత్ రెడ్డి.. కోవిడ్ కట్టడికి సంబంధించి ప్రధాని చేపట్టిన వీడియో కాన్ఫెరెన్స్ లో ముఖ్యమంత్రి ఎందుకు పాల్గొనలేదో సమాధానం చెప్పాలన్నారు.
కరోనా సాకుతో విద్యావ్యవస్థలు మూసివేశారు.. కానీ బార్లు, వైన్ షాపులు ఎందుకు బంద్ చేయడం లేదని ప్రశ్నించారు. అవి ఆదాయ మార్గాలుగానే కనిపిస్తుండటంతో వాటిని క్లోజ్ చేయడం లేదన్నారు. కేసీఆర్ వద్ద మంత్రులు ఎవరు లేరని... మంత్రుల రూపంలో వున్నవారంతా బంట్రోతులు అన్నారు. ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్, దళిత బంధు, మూడెకరాల భూమి, ఉచిత విద్య, రైతులకు ఉచిత ఎరువులు అని లెక్కలేనన్ని హామీలు ఇచ్చిన కెసిఆర్.. వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. మేనిఫెస్టోలో పెట్టినవి ఐదేండ్లలో అమలు చేస్తామని చెప్పి.. ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. అందుకే 2014, 2018లకు సంబంధించిన టీఆర్ఎస్ మేనిఫెస్టోలు కనిపించకుండా వెబ్ సైట్ల నుండి తొలగించారన్నారు.
READ MORE