- నగర అభివృద్ధి బాధ్యత నాదే
- జూన్ 30లోగా ఎస్డీఎఫ్ కింద రూ.3 కోట్లిస్తం
- వరంగల్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్‌రెడ్డి
హనుమకొండ, వరంగల్, వెలుగు: 'దేశంలోనే గొప్ప చారిత్రక నగరంగా అభివృద్ధి చెందాల్సిన ఓరుగల్లు పదేండ్ల కేసీఆర్ పాలనలో మసక బారింది. వరంగల్‌ను రెండో రాజధాని చేస్తాం. ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు, టెక్స్ టైల్ పార్క్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తీసుకొచ్చి నగరాన్ని డెవలప్ చేసే బాధ్యత నాదే'నని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఓరుగల్లు నగరానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి హనుమకొండ, వరంగల్ సిటీలో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్ ను తీర్చిదిద్దుతానని, ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రతిపాదనలను తీసుకురావాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
కడియం కావ్యకు ఆషామాషీగా టికెట్ ఇవ్వలేదని, ఉమ్మడి రాష్ట్రం నుంచి కడియం శ్రీహరి నిబద్ధతతో సేవలందించారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో ఆయన ప్రయత్నం ఉందని, ఆయన అనుభవాన్ని అభివృద్ధికి వినియోగించుకోవాలనుకునే కడియం వారసురాలిగా కావ్యకు టికెట్ ఇచ్చామన్నారు. మాదిగల ఏ,బీ,సీ,డీ వర్గీకరణ, ముదిరాజ్ లను బీసీ-ఏలో చేర్చాలన్న డిమాండ్లు నెరవేరాలంటే కడియం కావ్యను పార్లమెంట్‌కు పంపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతకుముందు మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఏటా రూ.300 కోట్లతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఏ ఒక్క పని చేయలేదన్నారు.
భగీరథ పేరున రోడ్లు తవ్వి పెట్టారని, నగరంలో నాలాలు సరిగా లేక వర్షం పడితే కాలనీలన్నీ నీట మునుగుతున్నాయన్నారు. నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో వరంగల్ నగరంలో లెదర్ పార్కు ఉండేదని, సిటీ మధ్యలో ఉందని దానిని క్లోజ్ చేశారన్నారు. లెదర్ పార్కుకు సిటీ శివారులో స్థలం కేటాయిస్తే వారందరికీ ఉపాధి దొరుకుతుందని, యువత కోసం స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు పెట్టాలని కోరారు. నగరంలోని బట్టలబజార్ వేంకటేశ్వరస్వామి గుడి, 400 ఏండ్ల చరిత్ర ఉన్న సీబీసీ చర్చి, దర్గాకు ఎస్డీఎఫ్ కింద రూ.కోటి చొప్పున నిధులు ఇవ్వాలని కోరగా, సీఎం సానుకూలంగా స్పందించారు. మంత్రి సురేఖ విజ్ఞప్తి మేరకు జూన్ 30లోగా ఎస్డీఎఫ్ కింద నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. వరంగల్ వెస్ట్, ఈస్ట్ నియోజకవర్గాల్లో జరిగిన రోడ్డు షోలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, కడియం శ్రీహరి, ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు.
కేటీఆర్ తక్కువ రోజులే బత్కుతవ్: కొండా మురళి
'కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని బీఆర్ఎస్ నాయకులు పదేపదే అంటున్నారని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని తిడ్తున్నారని, కేటీఆర్ ఇప్పటికే నీ ఆరోగ్యం దెబ్బతిన్నదని, నువ్ తక్కువ రోజులే బతుకుతవన్నారు. గత ప్రభుత్వ హయాంలో స్వేచ్ఛ లేకుండా పోయిందని, కాంగ్రెస్ సర్కారు వచ్చినంక మూడు నెలల నుంచి స్వేచ్ఛగా బతుకుతున్నామన్నారు. పదేండ్లు సీఎంగా రేవంత్ రెడ్డే ఉంటాడని, కాంగ్రెస్ కార్యకర్తలకు ఎప్పుడు ఆపదొచ్చినా అండగా ఉంటామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా పేరున్న వరంగల్ నగరాన్ని బీఆర్ఎస్ పాలకులు ఆరు ముక్కలు చేశారన్నారు. అందుకే బీఆర్ఎస్కు పాపం తాకిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని, రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్న పార్టీ చెంపచెల్లుమనిపించాలన్నారు. వరంగల్ సమగ్ర అభివృద్ధి కావాలంటే తనను గెలిపించాలని కోరారు.