- రాజిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి
- నర్సాపూర్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి
నర్సాపూర్, శివ్వంపేట, వెలుగు : నర్సాపూర్ లంబాడి సోదరుల అడ్డా.. గిరిజనుల అభివృద్ధికి ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలోని లంబాడి తండాల సమగ్ర అభివృద్ధికి రూ.100 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయిస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. సోమవారం నర్సాపూర్‌లో జరిగిన విజయభేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగులు, విద్యార్థులకు మేలు కలిగేలా నర్సాపూర్ నియోజకవర్గాన్ని సిరిసిల్ల జోన్ నుంచి చార్మినార్ జోన్ లో కలిపే అంశాన్ని కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
కాళేశ్వరం కాల్వలకు, రీజినల్ రింగ్ రోడ్డుకు భూములిచ్చే రైతులకు మెరుగైన పరిహారం అందేలా చూస్తామన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించి కాంగ్రెస్అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. నర్సాపూర్‌లో గెలిచి రేవంత్ రెడ్డికి గిఫ్ట్ ఇస్తామన్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో పోడు భూములు, కాళేశ్వరం, ట్రిపుల్ఆర్ నిర్వాసితులకు న్యాయం, నర్సాపూర్ ఆర్టీసీ బస్ డిపో విస్తరణ, పీజీ కాలేజీకి బిల్డింగ్ మంజూరు, గవర్నమెంట్ హాస్పిటల్ వంద పడకల స్థాయికి విస్తరణ, మినీ స్టేడియం, ఇంటిగ్రేటెడ్మార్కెట్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
సభ సక్సెస్‌తో కాంగ్రెస్ లో జోష్
కాంగ్రెస్విజయభేరి బహిరంగ సభకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సభ సక్సెస్ కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది. రేవంత్ రెడ్డి స్పీచ్సభకు వచ్చిన వారిలో ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా వివిధ మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో ఆంజనేయులు గౌడ్, రవీందర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, సుహాసినిరెడ్డి, సుజాత, శేషసాయిరెడ్డి, శ్రీనివాస్ గుప్తా, మల్లేశం, నరేందర్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఖాలేక్ పాల్గొన్నారు.