టీఆర్‌‌‌‌ఎస్‌‌పై రేవంత్‌‌ సీరియస్

హైదరాబాద్‌‌, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌‌ అభ్యర్థి నామినేషన్‌‌ దాఖలుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడాన్ని చూసి టీఆర్‌‌ఎస్‌‌ భయపడిందని, అందుకే ఫిరాయింపులకు పాల్పడుతోందని పీసీసీ చీఫ్‌‌ రేవంత్‌‌ రెడ్డి అన్నారు. శనివారం మునుగోడు ఉప ఎన్నికపై వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ మహేశ్‌‌ కుమార్‌‌ గౌడ్‌‌ అధ్యక్షతన నిర్వహించిన జూమ్‌‌ కాన్ఫరెన్స్‌‌లో రేవంత్‌‌ మాట్లాడారు. టీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ నేతలు కాంగ్రెస్‌‌ లీడర్లను అడ్డగోలుగా కొనేందుకు ఒత్తిడి చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో మనం మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. బూత్‌‌ స్థాయిలో సిద్ధం చేసుకున్న నాయకులను ఆ రెండు పార్టీలు కొంటున్నాయని ఆరోపించారు. టీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ నాయకుల అక్రమాలు, అవినీతిపై గ్రామాల్లో నిలదీయాలని సూచించారు. కాంగ్రెస్‌‌కు ఈ ఉప ఎన్నిక అత్యంత కీలకమని చెప్పారు. ఇంతవరకు చేసిన పని ఒక ఎత్తయితే, ఇకపై మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి 20 వరకు తాను మునుగోడులోనే ఉండి ప్రచారం చేస్తానని తెలిపారు. ఉప ఎన్నికల బాధ్యత ఉన్నోళ్లంతా మునుగోడులోనే ఉండాలని, పోలింగ్‌‌ తర్వాత మూడ్రోజులు రాహుల్‌‌ గాంధీతో కలిసి వారు భారత్‌‌ జోడో యాత్రలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.  

నిర్లక్ష్యం వద్దు: మాణిక్కం ఠాగూర్‌‌‌‌

మునుగోడు ఉప ఎన్నికతో పాటు భారత్‌‌ జోడో యాత్ర విషయంలోనూ నిర్లక్ష్యం వద్దని కాంగ్రెస్‌‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జి మాణిక్కం ఠాగూర్‌‌ అన్నారు. పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేసి ఉప ఎన్నిక, రాహుల్‌‌ యాత్ర సక్సెస్‌‌ చేయాలని సూచించారు. ఉప ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలను కలిసి ఓట్లు అడగాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌‌కుమార్‌‌ రెడ్డి అన్నారు. గ్రామాల్లో డోర్‌‌ పోస్టర్లతో, ఓటర్లను ప్రత్యక్షంగా కలవాలని చెప్పారు. ఉప ఎన్నికల్లో పార్టీ క్యాడర్‌‌ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ పనిచేస్తుందని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క అన్నారు.