సినీ స్టార్లతో సైబర్ క్రైమ్స్, డ్రగ్స్​పై షార్ట్ వీడియోలు చేయండి : రేవంత్

సినీ స్టార్లతో సైబర్ క్రైమ్స్, డ్రగ్స్​పై షార్ట్ వీడియోలు చేయండి : రేవంత్
  • సినిమా టైమ్​లో వాటిని థియేటర్లలో ప్లే చేయాలి: సీఎం రేవంత్ 
  • అట్లయితేనే టికెట్ రేట్ల పెంపుకు ఒప్పుకుంటం 
  • సినీ ఇండస్ట్రీకి సీఎం రేవంత్ షరతు

హైద‌‌రాబాద్‌‌, వెలుగు: సైబర్ నేరాలు, డ్రగ్స్​ దుష్ర్పభావాలపై అవగాహన కల్పిస్తూ షార్ట్ వీడియోలు చేయాలని సినీ ఇండస్ట్రీకి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అట్లయితేనే టికెట్ రేట్ల పెంపునకు అంగీకరించడంతో పాటు ఇతర అనుమతులు ఇస్తామని చెప్పారు. ‘‘సమాజాన్ని కాపాడాల్సిన సామాజిక బాధ్యత సినీ పరిశ్రమపై ఉంది. ప్రతి సినిమాలోని నటీనటులతో సైబ‌‌ర్ నేరాలు, డ్రగ్స్ దుష్ర్పభావాలపై అవ‌‌గాహ‌‌న క‌‌ల్పించే విధంగా ఒక‌‌టిన్నర, రెండు నిమిషాల వీడియోలు తీయాలి. ఆ వీడియోలను ఆయా సినిమాలు థియేటర్లలో ప్రదర్శించేటప్పుడు ప్లే చేయాలి. 

వాటిని థియేటర్ ఓనర్లు ఉచితంగానే ప్రదర్శించాలి” అని సూచించారు. తెలంగాణ సైబ‌‌ర్ సెక్యూరిటీ బ్యూరోకు 14 కార్లు, 54 బైకులు, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు (టీజీ న్యాబ్‌‌) 27 కార్లు, 59 బైకులు కేటాయించగా.. వాటిని మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని క‌‌మాండ్ కంట్రోల్ సెంట‌‌ర్‌‌లో సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. 

అనంత‌‌రం ఆయన మాట్లాడుతూ.. ‘‘డ్రగ్స్‌‌తో క‌‌లిగే న‌‌ష్టాల‌‌పై సినీ నటుడు చిరంజీవి ఇటీవల ఓ వీడియో తీసి పంపారు. అందుకు ఆయ‌‌న‌‌ను మ‌‌న‌‌స్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చిరంజీవిని ఇత‌‌ర న‌‌టులు ఆద‌‌ర్శంగా తీసుకోవాలి. సినిమా అనేది రూ.వంద‌‌ల కోట్ల వ్యాపార‌‌ం. వారి వ్యాపారాన్ని మేం కాద‌‌ని అనం. కానీ అదంతా ప్రజ‌‌ల నుంచి వ‌‌స్తున్నదనే విష‌‌యం గుర్తుంచుకోవాలి” అని అన్నారు. మీడియా సైతం రాజ‌‌కీయ వివాదాల‌‌పైనే కాకుండా సామాజిక స‌‌మ‌‌స్యల‌‌పైనా దృష్టిసారించాల‌‌ని సూచించారు. 

సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ ను అరికడితే ప్రమోషన్లు.. 

డ్రగ్స్‌‌ వినియోగం, సైబ‌‌ర్ క్రైమ్స్ పెరిగిపోవడంతో వాటిని నియంత్రించడానికి అవ‌‌స‌‌ర‌‌మైన నిధులు, అధికారుల‌‌ను పోలీసు శాఖ‌‌కు కేటాయించామ‌‌ని సీఎం రేవంత్ తెలిపారు. నేర‌‌గాళ్లు టెక్నాలజీని వినియోగించుకుంటున్నార‌‌ని, వారిని ఎదుర్కోవాలంటే అంత‌‌కుమించిన సాంకేతిక‌‌త‌‌ను పోలీసులు అందిపుచ్చుకోవాల‌‌ని సూచించారు. ‘‘సైబ‌‌ర్ మోసాల బారిన కేవ‌‌లం అమాయ‌‌కులే కాకుండా ఉన్నత విద్యావంతులు సైతం ప‌‌డుతున్నారు. సైబ‌‌ర్ మోసాల బారిన ప‌‌డిన వారికి స‌‌హాయం అందించేందుకు 1930 నంబర్ తో 24 గంట‌‌ల కాల్ సెంట‌‌ర్ ఏర్పాటు చేశాం. కొద్ది కాలంలోనే సైబ‌‌ర్ సెక్యూరిటీ బ్యూరో రూ.31 కోట్లను నేర‌‌గాళ్ల నుంచి రాబ‌‌ట్టి బాధితుల‌‌కు అంద‌‌జేసింది. ఆ సిబ్బందికి అభినంద‌‌న‌‌లు” అని తెలిపారు. 

‘‘గ‌‌తంలో ఉగ్రవాదంపై పోరాటం చేసినోళ్లకు ప్రమోష‌‌న్లు ఇచ్చేవారు. ప్రస్తుతం సైబ‌‌ర్ నేరాలు, డ్రగ్స్ ను అరిక‌‌ట్టే అధికారులకు మా ప్రభుత్వం ప్రమోషన్లు ఇస్తుంది. ఇందుకు విధివిధానాలు త‌‌యారు చేయాల‌‌ని డీజీపీ ర‌‌విగుప్తాను ఆదేశిస్తున్నాను. దానిపై అసెంబ్లీలో చ‌‌ర్చించి సంబంధిత చ‌‌ట్టం చేస్తాం” అని వెల్లడించారు. తెలంగాణ‌‌లో డ్రగ్స్ మాట విన‌‌ప‌‌డితేనే వెన్నులో వ‌‌ణుకు పుట్టేలా చేయాల‌‌ని పోలీసులను ఆదేశించారు. ‘‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌‌ బాధితులతోనే ఉండాలి.. నేర‌‌గాళ్లతో కాదు. నేర‌‌గాళ్లతోనూ ఫ్రెండ్లీగా ఉంటే పోలీసు శాఖ‌‌పై ఉన్న నమ్మకం పోతుంది. 

ఈ రెండింటి మ‌‌ధ్య తేడాల‌‌ను గుర్తించాలి” అని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఎం రాజ‌‌కీయ స‌‌ల‌‌హాదారు వేం న‌‌రేంద‌‌ర్ రెడ్డి, డీజీపీ ర‌‌వి గుప్తా, ఇంటెలిజెన్స్ అడిష‌‌న‌‌ల్ డీజీపీ బి.శివధ‌‌ర్‌‌రెడ్డి, టీజీ న్యాబ్ డీజీ సందీప్ శాండిల్య, సైబ‌‌ర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయ‌‌ల్‌‌, హైద‌‌రాబాద్‌‌, సైబరాబాద్‌‌, రాచ‌‌కొండ క‌‌మిష‌‌న‌‌ర్లు శ్రీ‌‌నివాస్ రెడ్డి, అవినాశ్ మహంతి, త‌‌రుణ్ జోషి త‌‌దిత‌‌రులు పాల్గొన్నారు.

ఇవే అతిపెద్ద సమస్యలు.. 

ప్రస్తుతం స‌‌మాజాన్ని ప‌‌ట్టిపీడిస్తున్న అతిపెద్ద స‌‌మ‌‌స్యలు సైబ‌‌ర్ నేరాలు, డ్రగ్సే అని సీఎం రేవంత్ అన్నారు. ‘‘ఒక‌‌ప్పుడు హ‌‌త్య, అత్యాచారాలు పెద్ద నేరాలుగా ఉండేవి. హ‌‌త్యతో ఒక‌‌రే చ‌‌నిపోతారు. కానీ డ్రగ్స్‌‌ ప్రభావంతో ఒక త‌‌రం ప‌‌నికి రాకుండా పోతుంది. 60 ఏండ్ల పోరాటం, వంద‌‌లాది మంది విద్యార్థులు, ఉద్యమ‌‌కారుల బ‌‌లిదానాల‌‌తో తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ తొలి నుంచి పోరాట ప‌‌టిమ క‌‌ల్గిన స‌‌మాజ‌‌ం. సామాజిక అస‌‌మాన‌‌త‌‌ల‌‌పై పోరాడేత‌‌త్వం ఇక్కడ ఉంది. ఉద్యమాల‌‌కు చిరునామా అయిన తెలంగాణ‌‌లో డ్రగ్స్ మాట వినిపించ‌‌కూడ‌‌దు’’ అని పోలీసు అధికారుల‌‌కు సూచించారు. 

‘‘గ‌‌త ప్రభుత్వ నిర్లక్ష్యంతో గ‌‌ల్లీగ‌‌ల్లీలోనూ గంజాయి వినియోగం పెరిగిపోయింది. కాలేజీలతో పాటు ఇత‌‌ర ప్రాంతాల్లోనూ గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి. ఉన్నత వ‌‌ర్గాలవారే కాకుండా పేద‌‌లు, మ‌‌ధ్యత‌‌ర‌‌గ‌‌తి వారు సైతం గంజాయికి బానిస‌‌లవుతున్నారు. ఇటీవ‌‌ల హ‌‌త్యలు, చిన్న పిల్లల‌‌పై దాడులకు కార‌‌ణ‌‌మైన వారిని ప‌‌రిశీలిస్తే.. వారిలో ఎక్కువ మంది గంజాయికి బానిస‌‌లైన‌‌వారేనని తేలింది” అని చెప్పారు. యువకులు డ్రగ్స్‌‌కు బానిస కావొద్దని సూచించారు.