వరంగల్: తెలంగాణలో ప్రతి మార్పునకు పునాది ఓరుగల్లు నుంచే పడుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్లో నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే రైతు సంఘర్షణ సభ మలిదశ పోరాటానికి అంకురార్పణ అవుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీకి వరంగల్ పట్ల పూర్తి స్పష్టత ఉందని చెప్పారు. కోటి ఎకరాలకు నీళ్లిస్తామన్న కేసీఆర్.. ఆ పంటలు ఎందుకు కొనరని ప్రశ్నించారు. రైతులను దుఖంతో తాగుబోతులను తయారుచేసి ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నారని రేవంత్ విమర్శించారు.
రాష్ట్రంలో ఎక్కడ హత్య జరిగినా దాని వెనుక టీఆర్ఎస్ నాయకులే ఉంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ సంస్కృతి విచ్ఛిన్నమవుతోందని, గంజాయి, డ్రగ్స్, పబ్స్ కు తెలంగాణను కేరాఫ్ గా మారుస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎక్కడ వాహనం ఆపి తనిఖీలు చేసినా.. వందలాది కిలోల గంజాయి దొరుకుతోందని మండిపడ్డారు. 145 మంది డ్రగ్స్ తీసుకుని పట్టుబడితే కనీసం విచారణ జరపకుండా బయటకు పంపించారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ త్యాగాల ముందు మీవి ఓ లెక్కా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ కడుపు నిండా విషం పెట్టుకుని వచ్చినందునే ప్రకృతి కూడా క్షమించలేదని అన్నారు. నీడనిచ్చిన వారి గొంతు కోయడం టీఆర్ఎస్ నేతల నైజమన్న రేవంత్ రెడ్డి.. 2001 నుండి 2007 వరకు కేసీఆర్ కారుకు పెట్రోల్ కొట్టించిందెవరో గుర్తు చేసుకోవాలన్నారు. కేసీఆర్ సభ కన్నా భారీ స్థాయిలో వరంగల్ లో కాంగ్రెస్ సభ నిర్వహిస్తామని చెప్పారు.