
- భూములను లాక్కునేందుకే ధరణి పోర్టల్.. దాన్ని రద్దు చేయాలి
- ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. ఇప్పుడు దొంగ ఏడుపులా?: రేవంత్ రెడ్డి ఫైర్
వికారాబాద్/చేవెళ్ల, వెలుగు : లిక్కర్ స్కామ్ నిందితులను అరెస్టు చేయకుండా నోటీసుల పేరుతో డ్రామాలాడుతున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ కేసులో ఉన్న దొంగలను గల్లా పట్టి ఈడ్చుకెళ్లి తీహార్ జైల్లో వేయాలని డిమాండ్ చేశారు. విచారణ సంస్థలకు సహకరించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తమ హుందాతనాన్ని చాటుకున్నారని.. విచారణకు బీఎల్ సంతోష్, కవిత ఎందుకు హాజరు కావడంలేదని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో మన భాష, యాసలపై దాడి జరుగుతున్నదని రెచ్చగొట్టి, గద్దెనెక్కిన కేసీఆర్ ఇప్పుడు మన ప్రజల బతుకులపై దాడి చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, కాంగ్రెస్‌పై కుట్ర చేసి సమస్యలపై చర్చ జరగకుండా చేస్తున్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించింది. ఇందులో భాగంగా వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో రేవంత్ పాల్గొని మాట్లాడారు.
నీ పార్టీ చీలికలైతది
రాష్ట్రంలో జరిగే దర్యాప్తు సంస్థల దాడులు గుజరాత్‌లో ఎందుకు జరగడం లేదని రేవంత్ ప్రశ్నించారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన కేసీఆర్.. ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని మండిపడ్డారు. ‘‘2015లో అన్యాయంగా నన్ను జైల్లో పెట్టారు. నా కూతురు పెండ్లికి పోకుండా చేయాలని కుట్ర చేసిన కేసీఆర్.. ఇవాళ నీ బిడ్డ ఇంటికి సీబీఐ వచ్చింది. నీ పాపం ఊరికే పోదు. పక్క పార్టీలను అంతం చేస్తే అధికారం శాశ్వతంగా ఉంటదని నమ్మిన నీకు.. భగవంతుడే శిక్ష విధించే పరిస్థితి వచ్చింది. నీ పార్టీ చీలికలై పోతది” అని నిప్పులుచెరిగారు. గోదావరి జలాలు రంగారెడ్డి జిల్లాకు రాకుండా అడ్డుకున్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు రావాల్సిన గోదావరి జలాలను కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న మెదక్ జిల్లాకే పరిమితం చేశారన్నారు. అందరికీ న్యాయం జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని.. కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపేద్దామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కలెక్టర్ ఆఫీసులోకి దూసుకెళ్లిన్రు
రేవంత్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు టి.రాంమోహన్ రెడ్డి తదితరులు.. వికారాబాద్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి బయల్దేరారు. ఈ టైమ్‌లో పోలీసు బందోబస్తును దాటుకుని కలెక్టర్ చాంబర్‌లోకి వెళ్లేందుకు పలువురు ప్రయత్నించారు. కానీ పోలీసులు రేవంత్, గడ్డం ప్రసాద్ కుమార్, రామ్మోహన్ రెడ్డిని లోనికి అనుమతించారు. ఇంతలోనే కాంగ్రెస్ నాయకులు, ధరణి బాధితులపై లాఠీచార్జ్ చేయగా, పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల తీరుకు నిరసనగా కాంగ్రెస్ లీడర్లు అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
పంట బీమా ఎందుకిస్తలే
‘‘మన కల్చర్ అయిన అగ్రికల్చర్‌ను నాశనం చేసి భూములు లాక్కోవాలనే దురుద్దేశంతోనే ధరణి పోర్టల్‌ను తెచ్చారు. అగ్రికల్చర్‌ను కార్పొరేట్‌కు కట్టబెట్టాలని, మళ్లీ రైతులను కూలీలుగా మార్చాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారు’’ అని రేవంత్ ఆరోపించారు. రైతు బీమా ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్.. పంట నష్టానికి బీమా ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. పంట బీమా ఇవ్వని కేసీఆర్.. రైతుల చావులకు మాత్రం వెలకడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సాయం అందాలంటే రైతు చావాల్సిందేనా అని ప్రశ్నించారు. 80 వేల మంది రైతులకు రైతు బీమా వచ్చిందని వ్యవసాయ మంత్రి చెబుతున్నారని, అంటే ఐదేండ్లలో 80 వేల మంది రైతులు చనిపోయారని ప్రభుత్వం అధికారికంగా ఒప్పుకున్నట్లేనని చెప్పారు.