
కాంగ్రెస్ వస్తే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల కరెంట్ తీసేస్తానన్నారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వర్దన్న పేటలో ఎన్నికల ప్రచారం చేసిన రేవంత్.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని ప్రచారం చేస్తున్నారు...కానీ కాంగ్రెస్ వస్తే ముందుగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత రావుల కరెంట్ తీస్త.. వాళ్ల ట్రాన్స్ ఫార్మర్లు పేలుస్తానన్నారు.పేదలకు గూడు లేదు కానీ.. కేసీఆర్, కేటీఆర్ వందల ఎకరాల్లో ఫాంహౌసులు కట్టుకున్నారని విమర్శించారు. గజ్వేల్ లో కేసీఆర్.. జన్వాడలో కేటీఆర్..పంజాగుట్టలో ప్రగతి భవన్ ఇలా పేదల సొమ్ముతో పెద్దపెద్ద భవంతులు కట్టుకున్నారని ధ్వజమెత్తారు.
మనమడిని మంత్రిని చేసేందుకు కేసీఆర్ మూడోసారి అధికారం అడుగుతున్నారని విమర్శించారు రేవంత్. తెచ్చుకున్న తెలంగాణను ఎవరేలుతున్నారని ప్రశ్నించారు. వర్దన్న పేట కాంగ్రెస్ అడ్డా అని అన్నారు .. ఆరూరి రమేష్ రైతుల భూముల్ని గుంజుకోలేదా అని ప్రశ్నించారు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడిందన్నారు. మన స్వేఛ్ఛను ప్రభుత్వం గుంజుకుందన్నారు. కేసీఆర్ కుటుంబం కోసమే విద్యార్థులు త్యాగాలు చేశారా? అని ప్రశ్నించారు. నీళ్లు,నిధులు, నియామకాలు పూర్తికాలేదన్నారు.
పేకమేడలా కాళేశ్వరం కట్టారని విమర్శించారు రేవంత్. బుద్ధున్నోళ్లు ఎవరైనా ఇసుక మీద ప్రాజెక్టు కడతారా? అని ప్రశ్నించారు. ఇవాళ మేడిగుడ్డ కుంగిపోయిందన్నారు. పది సంవత్సరాల్లో లక్షల కోట్లు సంపాదించుకున్న కేసీఆర్..వేల ఎకరాలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు.