కమ్యూనిస్టులు మాకు సహజ మిత్రులు

నల్గొండ: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొత్త సీసాలో పాత సారా లాంటోడని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆదివారం మునుగోడు నియోజకవర్గంలోని జనగాం గ్రామంలో రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ... కాంగ్రెస్ తరఫున గెలిచిన రాజగోపాల్ రెడ్డి...పార్టీకి ద్రోహం చేసి ఇవాళ బీజేపీ తరఫున వస్తున్నారని మండిపడ్డారు. మునుగోడు గడ్డపై 12 సార్లు ఎన్నికలు జరిగితే.. ఒక్కసారి కూడా బీజేపీకి డిపాజిట్ దక్కలేదన్నారు. మునుగోడు కాంగ్రెస్ కంచుకోట అని, మునుగోడులో గెలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ కు 100 సీట్లు వచ్చినట్లేనని అన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు తగిన ప్రాధాన్యముంటుందని, తమ పార్టీ అధికారంలోకి వస్తే నలుగురు మహిళలకు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తామన్నారు. వచ్చే ఉప ఎన్నికలో పాల్వాయి స్రవంతిని గెలిపించాలని కోరారు.

కమ్యూనిస్టులు మాకు సహజ మిత్రులు

కమ్యూనిస్టులు తమకు సహజ మిత్రులని రేవంత్ రెడ్డి చెప్పారు. కమ్యూనిస్టులను తానెప్పుడూ కించపరిచేలా మాట్లాడలేదని, అవమానించినట్లు నిరూపిస్తే ధర్మ భిక్షం విగ్రహం ముందు ముక్కు నేలకు రాస్తానని చెప్పారు. కమ్యూనిస్టు అగ్రనేతలు ఎవరికి సపోర్ట్ చేసినా... ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ కు అండగా నిలవాలని రేవంత్ కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరాయి పాలన నడుస్తోందని, వాళ్లను తరిమికొట్టాల్సిన అవసరం ఉందని రేవంత్ చెప్పారు.