అవినీతి బీఆర్ఎస్ సర్కార్ ను ఇంటికి సాగనంపే సమయం వచ్చిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. దొరల ప్రభుత్వాన్ని గద్దె దించి.. ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తామని అయన అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023, నవంబర్ 26వ తేదీ ఆదివారం నారాయణపేటలో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
వికారాబాద్ కు రెండో రైల్వే లైను ఎందుకు తీసుకురాలేదని... కొడంగల్, నారాయణపేటకు సాగునీరు ఎందుకు ఇవ్వలేదని రేవంత్ ప్రశ్నించారు. మూడోసారి కేసీఆర్ గెలిస్తే.. తెలంగాణ ఆగమైతదని చెప్పారు. ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి రెండుసార్లు గెలిచినా అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. నారాయపేటను బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని.. కనీస మౌళిక వసతులు కూడా కల్పించలేదన్నారు.
రాజేందర్ ఫోకస్ మొత్తం రాయ్ చూర్ వ్యాపారాలపైనే పెట్టారని.. ఎన్నడూ ప్రజలకు అందుబాటులో ఉండని ఎమ్మెల్యే అవసరమా? అని ప్రజలనుద్దేశించి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చిట్టెం నర్సిరెడ్డి వారసురాలు పర్ణికను గెలిపించాలని రేవంత్ కోరారు. కాంగ్రెస్ అధికరంలోకి రాగానే రూ.2లక్షల రైతు రుణమాఫీతోపాటు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని, రూ.500లకే వంట గ్యాసు సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 18ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.2500లు ఇస్తామని హామీ ఇచ్చారు.