కేసీఆర్ చెప్పిన తెలంగాణ మోడల్ ఇదేనా : రేవంత్ రెడ్డి

ప్రతీ ప్రాంతంలో ఒక గొప్ప పవిత్ర  స్థలం ఉంటుందని..కరీంనగర్ లో అలాంటి గొప్ప పవిత్ర స్థలం అంబేద్కర్ స్టేడియమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో ఇవాళ కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ఆయన మాట్లాడారు. 60 ఏళ్ల ఆకాంక్షను గౌరవించి 2004లో ఇదే గడ్డపై తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ మాట ఇచ్చారని గుర్తు చేశారు. మాట తప్పక మడమ తిప్పక.. సోనియా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారన్నారు. ఇచ్చిన రాష్ట్రం ఇవాళ ఎవరిపాలైందో మీరు ఆలోచన చేయాలని కోరారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా..కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చారా అని రేవంత్ ప్రశ్నించారు.

ఇక్కడ ఎంపీలుగా గెలిచిన కేసీఆర్, తన కుటుంబం కరీంనగర్ కు ఏం చేశారో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. పొన్నం ప్రభాకర్ ను గెలిపిస్తే.. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. జైపాల్ రెడ్డి చొరవతో, వ్యూహంతో ఆనాడు తెలంగా రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. తల్లిని చంపి పిల్లను బ్రతికించారని మోదీ అవహేళన చేశారు..తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేని బీజేపీ నేతలకు ఓట్లు అడిగే హక్కు లేదని ఆరోపించారు. ఇక్కడ గెలిచిన బండి సంజయ్ కరీంనగర్ కు ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ పదే పదే తెలంగాణ మోడల్ అంటున్నారు..తెలంగాణ మోడల్ అంటే తాగుబోతుల తెలంగాణనా అంటూ నిలదీశారు. కేసీఆర్ వచ్చాక 3వేల వైన్ షాపులు.. 60వేల బెల్టు షాపులు వచ్చాయన్నారు. కేసీఆర్ చెప్పిన తెలంగాణ మోడల్ ఇదేనా అని ప్రశ్నించారు.

కేసీఆర్ పై కోపంతో బీజేపీ వైపు చూస్తే... పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే అని రేవంత్ అన్నారు. గుజరాత్ మోడల్ కావాలో.. ఛత్తీస్ ఘడ్ మోడల్ కావాలో విజ్ఞులు ఆలోచించాలని కోరారు. తెలంగాణ మోడల్ కావాలో..  ఛత్తీస్ ఘడ్ మోడల్ కావాలో ఆలోచన చేయండని సూచించారు. ఎవరి చేతిలో పెడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రేవంత్ వ్యాఖ్యానించారు. "కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇల్లు లేని ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తాం.. ఖాళీగా ఉన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం..పేద రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం..ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటాం" అని రేవంత్ హామీ ఇచ్చారు.