నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో తెలంగాణ ప్రజలను కేసీఆర్ వచించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు.తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే..వారిపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. రైతు రాజ్యం అని చెప్పి..రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్..వేల కోట్లు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
60 ఏండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సోనియా గాంధీ నెరవేర్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ ఇవ్వకుంటే కల్వకుంట్ల కుటుంబం నాంపల్లి దర్గా దగ్గర బిచ్చం ఎత్తుకునేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇవ్వకపోతే కేటీఆర్ అమెరికాలో బాత్రూమ్ లు కడిగేవారని చురకలంటించారు.
కాంగ్రెస్ తెలంగాణకు ఏం చేశారంటూ కేటీఆర్ అహంకారపు మాటలు మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు, కోయిల్ సాగర్, పాలమూరు రంగారెడ్డి, శంషాబాద్ ఎయిర్ పోర్టు, ఓఆర్ఆర్, మెట్రో రైల్ వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణలో చేసింది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. తెలంగాణకు జవహార్ లాల్ నెహ్రూ స్వాతంత్య్రం తెచ్చారని..రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ పరిచయం చేశారని గుర్తు చేశారు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారని చెప్పారు. సోనియా గాంధీ, సోనియా గాంధీలకు ప్రధాని పదవిని చేపట్టే అవకాశం వచ్చినా తిరస్కరించారని తెలిపారు.
తెలంగాణ ప్రజల కోసం సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలు ప్రకటించారని రేవంత్ రెడ్డి తెలిపారు. మోదీ సిలిండర్ కు రూ. 1200 వసూలు చేస్తుంటే..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేవలం రూ. 500కే సిలిండర్ ఇస్తామన్నారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. రైతు భరోసా కింద ఏడాదికి రూ. 15 వేలు ఇస్తామని చెప్పారు. వృద్ధులకు రూ. 4వేల పింఛన్ అందిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద రూ. 5 లక్షలు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ ఇవ్వాలంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.