భూములు ఆక్రమించేందుకే.. కేసీఆర్ కామారెడ్డి వస్తుండు: రేవంత్ రెడ్డి

భూములు కొల్లగొట్టేందుకే  కామారెడ్డిలో  కేసీఆర్ పోటీచేస్తున్నారని  టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కామారెడ్డి చుట్టూ ఉన్న భూములపై కేసీఆర్ కన్నుపడిందన్నారు. సీఎం కేసీఆర్ ను  ఓడించడానికే  తాను కామారెడ్డిలో పోటీచేస్తున్నానని చెప్పారు.  కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ సభలో మాట్లాడిన రేవంత్.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయడం కాదు బీఆర్ఎస్ ప్రభుత్వమే రద్దయ్యిందన్నారు.  కామారెడ్డి తీర్పు చరిత్రలో నిలిచిపోతుందన్నారు.  

కేసీఆర్ ను చిత్తుగా ఓడించేందుకు కామారెడ్డిలో ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు రేవంత్ .  గజ్వేల్ ను బంగాను తునక చేస్తే కేసీఆర్ కామారెడ్డి ఎందుకు పారిపోయిండన్నారు .తెలంగాణ భవిష్యత్ ను కామారెడ్డి నిర్ణయిస్తుందన్నారు. కామారెడ్డిని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనన్నారు. కేసీఆర్ ను గెలిపిస్తే కామారెడ్డికి ఎన్నడూ రాడు..కల్వడు బతుకులు ఆగం చేస్తడన్నారు.కాంగ్రెస్ గెలిస్తే కామారెడ్డిలో తాను,షబ్బీర్ అలీ అండగా ఉంటామన్నారు.

తన మీద పెట్టిన కేసులపై  సీబీఐ, ఈడీ విచారణకు తాను సిద్ధమని.. కేసీఆర్  సిద్దమా అంటూ  సవాల్ విసిరారు  రేవంత్.   కొండపోచమ్మ రిజర్వాయర్లో గజ్వేల్ రైతులను ముంచిండని.. మల్లన్న సాగర్ లో వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. తెలంగాణ రాజకీయాల్ని అంగడి సర్కుల్లా చేసిందే కేసీఆర్ అని ధ్వజమెత్తారు. సంతలో పశువులను కొన్నట్లు కేసీఆర్ ఎమ్మెల్యేలను కొన్నారని ఆరోపించారు. తెలంగాణ ఉన్నది కేసీఆర్ కుటుంబం కోసమేనా? అని ప్రశ్నించారు రేవంత్.,