మునుగోడు అభివృద్ధి కోసం ఉప ఎన్నిక రాలేదని.. కేవలం ఓట్లను వేల కోట్లకు అమ్ముకుంటే వచ్చాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఇటీవలే వచ్చిన ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు ఏం అభివృద్ధి చేశారో చూడాలని ప్రజలకు సూచించారు. పక్కనే ఉన్న నాగార్జున సాగర్, హుజూర్ నగర్ లు అభివృద్ధి చెందలేదన్నారు. టీఆర్ఎస్, బీజేపీలను తరిమికొట్టి కాంగ్రెస్ ను గెలిపించాలని ఓటర్లను కోరారు.
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన గోవర్ధన్ రెడ్డి బిడ్డగా పాల్వాయి స్రవంతి ముందుకు వచ్చిందని.. గెలిపించుకునే బాధ్యత మీదేనని రేవంత్ అన్నారు. ఇక మునుగోడులో రాత్రి అయితే చాలు.. మద్యం ఏరులై పారుతోందన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు చిన్న పిల్లలను మందుకు బానిసలు చేస్తున్నాయని విమర్శించారు. నామినేషన్ వేసిన రోజు ఒక్కరికి కూడా నోరు తిరగలేదన్నారు. పార్టీ అధ్యక్షుడి పేరు పలకడం రాలేదని.. అలాంటి వారికి ఓట్లు ఎలా వేస్తారో ఆలోచించాలన్నారు.