
రేషన్ డీలర్ గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావుకు వేలాది ఎకరాలు ఎలా వచ్చాయని టీపీసీసీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజల సొమ్ము దోచుకుని అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023, నవంబర్ 9వ తేదీ గురువారం పాలకుర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
పాలకుర్తి అంటేనే పౌరుషాలకు కేరాఫ్ అని.. దోపిడి సొమ్ముతో ఓటర్లను కొనాలని ఎర్రబెల్లి దయాకర్ రావు చూస్తుండని.. ఎర్రబెల్లి మోసాలకు నవబంర్ 30న బుద్ది చెప్పాలన్నారు. దయాకర్ రావుకు వేల ఎకరాలు ఎలా వచ్చాయని... దందాలు చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించాడని అన్నారు. డీలర్ దాయకర్.. డాలర్ దయాకర్ రావు ఎలా అయ్యాడని తీవ్ర ఆరోపణలు చేశారు. తనను జైల్లో పెట్టించిందే ఎర్రబెల్లి దయాకర్ అని... శత్రువులతో చేతులు కలిపి తెలుగు దేశం పార్టీకి నమ్మకద్రోహం చేశాడని నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికల్లో ఎర్రబెల్లిని బొంద పెట్టాలన్నారు.
రాజ్యసభ సీట్లను కేసీఆర్ వందల కోట్లకు అమ్ముకున్నాడని అన్నారు రేవంత్. పాలకుర్తి అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం అవుతుందని.. పాలకుర్తిలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని అన్నారు. ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. రాష్ట్రంలో 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చినట్లు రుజువు చేస్తే.. తన నామినేషన్ వెనక్కి తీసుకుంటానని.. ఇవ్వకుంటే కేసీఆర్ ముకును నేలకు రాసి క్షమాపణలు చేప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదోడికి న్యాయం జరుగుతుందన్నారు. డిసెంబర్ 9న వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈ ఎన్నికల్లో దొరల-కు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతుందని చెప్పారు. పాలకుర్తిలో ఎర్రబల్లిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.