మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత కేసీఆర్ కు అమ్ముడుపోయారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆర్మూర్ పట్టణంలో రేవంత్ రెడ్డి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో మాట్లాడిన రేవంత్.. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రజల రక్తం తాగుతున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే, ఆయన సోదరుని భూకబ్జాలు అరాచకాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు.
కారు స్టీరింగ్ తన చేతిలో ఉందంటూ ఎంఐఎం నేత అసదుద్దీన్, కేసీఆర్ కు ఓట్లు వేయించారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రధాని మోడీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ చలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. గల్ఫ్ భీమా అమలు చేస్తామని.. నకిలీ ఏజెంట్లను జైల్లో పెడతామని హెచ్చరించారు.