
- కబ్జాల మంత్రి మల్లారెడ్డిని ఓడించాలె: రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్‌లో చేరిన జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి,
- మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి
ఘట్ కేసర్, వెలుగు: కేసీఆర్ ధన బలంతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని.. కబ్జాలకు పాల్పడిన మంత్రి మల్లారెడ్డి నుంచి మేడ్చల్ సెగ్మెంట్‌కు విముక్తి కల్పించే రోజు దగ్గరలో ఉందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఘట్కేసర్ మండలం ప్రతాప్ సింగారంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి తమ అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. రేవంత్ వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ అవినీతిలో కూరుకుపోయిన మల్లారెడ్డిని ఓడించి ఇంటికి పంపాల్సిన అవసరం ఉందని అన్నారు. కొడంగల్ లో ఓడిన తనను మల్కాజిగిరి పార్లమెంటు ప్రజలు కడుపులో పెట్టుకుని ఎంపీగా గెలిపించారని, వారికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ను గెలిపిస్తే మేడ్చల్ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
మల్కాజిగిరి ఎంపీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు. టికెట్ రాని వారు తనను తిట్టినా కుటుంబ పెద్దగా వాళ్ల బాధను అర్థం చేసుకుంటానని అన్నారు. వారికి భవిష్యత్ లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మేడ్చల్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుంచి ఇప్పటి వరకు మల్లారెడ్డి ప్రభుత్వ భూములు,అసైన్డ్ భూములను ఇష్టానుసారంగా కబ్జా చేశాడని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆరోపించారు.
మల్లారెడ్డి నుంచి ఈ ప్రాంతాన్ని విముక్తి కల్పించడమే మనందరి ఏకైక లక్ష్యమన్నారు. మేడ్చల్ అసెంబ్లీ నుంచి తోటకూర వజ్రేశ్ యాదవ్ (జంగయ్య యాదవ్) గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. కార్యక్రమంలో మేడ్చల్, ఉప్పల్ నియోజక వర్గాల అభ్యర్థులు తోటకూర వజ్రేష్ యాదవ్, ఎం.పరమేశ్వర్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.